Friday, December 27, 2024

ధరల పెరుగుదల ఎవరి ఘనత?

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel Prices

ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. ఉపాధి ఉన్న వారికి కూడా వేతనాల పెరుగుదల ఉండటం లేదు. 200405 నుంచి 201112 వరకు కాజువల్, రెగ్యుల కార్మికుల వేతన పెరుగుదల 5.2 శాతం ఉంటే 201112 నుంచి 2017 18 వరకు 1.05 శాతానికి తగ్గిందని (ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ వర్కింగ్ పేపర్ 1 2020) తేలింది. కరోనా కాలంలో పరిస్ధితి ఎలా దిగజారిందో, తరువాత ఎలా ఉందో తెలిసిందే. 2021 మార్చి నెలతో పోలిస్తే 2022 మార్చి నెలలో ఆహార ధరల పెరుగుదల రేటు రెట్టింపు అంటే నమ్ముతారా? ఇవి ఏప్రిల్ 12న ప్రకటించిన మోడీ ప్రభుత్వ లెక్కలే. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం 2021 మార్చి నెలలో 3.94 శాతం ఉంటే, ఈ ఏడాది 8.04 శాతానికి పెరిగింది. ఇదే మాదిరి ధరల సూచిక 4.61 నుంచి 7.66 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చినెలల్లో 5.81 నుంచి 8.04 శాతానికి చేరింది. దేశం మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో 4.87 నుంచి 7.68 శాతానికి, మొత్తంగా ధరల సూచిక గత పదిహేడు నెలల్లో గరిష్టంగా 6.95 శాతానికి ఈ ఏడాది మార్చిలో పెరిగింది. ఆహార వస్తువుల్లో నూనెల ధరల సూచిక ఏడాది క్రితంతో పోలిస్తే 18.79 పెరిగింది.

Sunflower oil prices increased by 20%
ధరలు పెరిగితే ఏమౌతుంది? ప్రతి ఒక శాతం ఆహార ధరల పెరుగుదల కోటిమందిని దుర్భర దారిద్య్రంలోకి నెడుతుందని ప్రపంచ బాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ చెప్పాడు. ధనికులు తట్టుకుంటారు, పేదలు ఓపలేరు, పోషకాహార లేమితో పిల్లలు గిడసబారతారు అని కూడా చెప్పాడు. ద్రవ్యోల్బణ పెరుగుదల ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచ మంతటా ఉంది, అమెరికా,బ్రిటన్, చైనా, శ్రీలంక, పాకిస్తాన్‌లో కూడా ఉంది అని కొంత మంది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వెనకేసుకు వచ్చేందుకు పూనుకున్నారు. అంటే మన ఏలికలు దేశాన్ని లంక, పాకిస్తాన్‌గా మార్చబోతున్నారా? నరేంద్ర మోడీ విధానాల ఘనత ఎక్కడికి పోయినట్లు? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఇతర సందర్భాల్లో వాటితో మనలను పోల్చటం ఏమిటని అంటారు. బ్రిటన్‌లో గ్యాస్, విద్యుత్ ఛార్జీలు ఇటీవలి కాలంలో 54 శాతం పెంచిన కారణంగా అక్కడ ఏడు శాతం ద్రవ్యోల్బణం ఉంది. మరి మన దేశంలో కూడా అదే స్థాయిలో ఎందుకున్నట్లో మోడీ సమర్ధకులు చెప్పాలి. అమెరికాలో ధరల సూచిక 8.5 శాతం పెరిగింది. చైనాలో ఫిబ్రవరి నెలలో 0.9 శాతం వినియోగదారుల సూచి పెరగ్గా మార్చి నెలలో 1.5 శాతం ఉన్నట్లు రాయిటర్ వార్తా సంస్ధ పేర్కొన్నది.

Domestic LPG Gas price hiked by Rs 25

దక్షిణ కొరియాలో 4.1 శాతం ఉంది. పాకిస్తాన్‌లో మార్చి నెలలో 12.7, శ్రీలంకలో 18.7 శాతం చొప్పున ఉంది. మనం ఎవరి బాటలో నడవబోతున్నాం ? చైనా మార్గమా ? ఇతర దేశాల వెంటా ? ఎవరి మార్గం అనుసరిస్తారో మనకు అనవసరం, ధరలు తగ్గకపోతేమానే పెరగకుండా చూడండి మహాప్రభో అంటున్నారు జనం.ప్రతి దానికీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక సాకుగా చూపటం, జనాన్ని వెర్రివాళ్లను గావించటం మామూలైంది. మనం కూడా గుడ్డిగా నమ్ముతున్నామనుకోండి ! సదరు యుద్ధం ప్రారంభమైంది ఫిబ్రవరి 24న, కానీ ఆ నెలలో మన దేశ పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి 1.7శాతమే, కానీ అంతకు గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 4.7శాతం తగ్గింది.ఈ కాలంలో అంతా బాగుందన్నారు, నవంబరు నాలుగు నుంచి137 రోజులు చమురు ధరలను మన సర్కారు పెంచలేదు. ఇతర రంగాల ప్రభావాలేమీ లేవు.ఈ కాలంలో కార్మికుల సమ్మెలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. మరి ఉత్పత్తి ఎందుకు పడిపోయినట్లు ? ఎలక్ట్రానిక్స్ వంటి గృహోపకరణాలు, ఇతర పరికరాల ఉత్పత్తి 8.2, 5.5 శాతాల చొప్పున తిరోగమనంలో ఉంది.
మార్చి నెల, తరువాత రోజుల్లో యుద్ధ ప్రభావాల గురించి నిపుణులు చెబుతున్న అంశాలను చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మరింతగా పడిపోనుంది. ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా 30,20 శాతాల చొప్పున ఉంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే దేశాల్లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు. మనదేశంలో ఎందుకు పెరగాలి? ఆహార ధాన్యాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నట్లు కొందరు చెబుతారు. అదే నిజమైతే ధరలెందుకు తగ్గటం లేదు. దేశంలో 2325 మిలియ టన్నుల ఖాద్య తైలాల వినియోగం ఉండగా స్ధానికంగా ఉత్పత్తి పది మిలియ టన్నులు. మిగతాదంతా దిగుమతే. మన దేశం దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల్లో పామాయిల్ 62 శాతం ఉంది. పొదు ్దతిరుగుడు గింజల నూనె వాటా 14 శాతమే. అది ఫిబ్రవరి వరకు సజావుగానే వచ్చింది. అక్టోబరుతో ముగిసిన ఏడాదిలో మనం 1.89 మిలియన్ టన్నుల పొద్దు తిరుగుడు నూనె దిగుమతి చేసుకున్నాం.
మన దిగుమతుల్లో ఉక్రెయిన్ నుంచి 74, రష్యా, అర్జెంటీనాల నుంచి 12 శాతాల చొప్పున జరుగుతోంది. ఉక్రెయిన్ నుంచి మార్చి నెలలో దిగుమతులు నిలిచినా ఇతర దేశాల నుంచి ఆ మేరకు పామాయిల్ దిగుమతులు పెరిగినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. అలాంటపుడు నూనెల ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఏముంది? ధరల మీద పాలకుల నియంత్రణ కొరవడిందన్నదే అసలు కారణం. పర్యవసానంగా రూ. 120 నుంచి రూ. 190 వరకు నూనెల ధరలు పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకొనే నూనెల మీద విధించిన పన్నుల ద్వారా ఏటా రూ. 35వేల కోట్లు కేంద్రానికి రాబడి వస్తున్నది. నూనె గింజలసాగు గిట్టుబాటుకాని కారణంగానే రైతాంగం వరి, గోధుమల వైపు మొగ్గుతున్నారు. సగటున ఏటా పది బిలియన్ డాలర్లను దిగుమతులకు వెచ్చిస్తున్నారు తప్ప రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు లేవు. తొలి ఐదేండ్లలో అన్ని లోపాలను సరిదిద్దారు అని గతంలో నరేంద్ర మోడీ గురించి చెప్పారు. మరి ఇప్పుడు ఎనిమిదేండ్లు గడచినా ఈ లోపాన్ని ఎందుకు సరిచేయలేదన్నది ప్రశ్న. 2013 14లో మన దేశం 11.82 మి.టన్నులు దిగుమతి చేసుకోగా ఇప్పుడు 15 మి.టన్నులకు పెరిగిందే తప్ప తరగలేదు.
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతన పెరుగుదల ఉండదు, దాంతో కొనుగోలు శక్తి పడిపోతుంది. అది వస్తు వినిమయం తగ్గటానికి, ఉత్పత్తి తగ్గేందుకు, అది ఉపాధి కోల్పోవటానికి దారితీస్తుంది. ఇదంతా ఒక విష వలయం. పట్టణ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్ జూన్‌లో నిరుద్యోగం12.6 శాతానికి చేరింది. అంతకు ముందు మూడు నెలలతో పోలిస్తే ఉపాధి పొందుతున్న 15 ఏండ్లకు పైబడిన వారి శాతం 43.1 నుంచి 40.9 శాతానికి తగ్గింది.కొంత మంది నమ్మిక ప్రకారం ఏ జన్మలో చేసుకున్న ఖర్మఫలితమో ఇప్పుడు జనం అనుభవిస్తున్నారు. ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలేమంటున్నారో చూద్దాం. పిటిఐ వార్తా సంస్ధ 2021 ఆగస్టు ఒకటిన ఇచ్చిన కథనం ప్రకారం మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ కాంగ్రెస్ నిరసన మీద మండిపడుతూ అసలు దేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఒకటి రెండు రోజుల్లో వచ్చింది కాదని, 1947 ఆగస్టు 15న ఎర్రకోట దగ్గర ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగంతో ప్రారంభమైందని సెలవిచ్చారు. వ్యాక్సిన్లు ఉచితంగా వేయటం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసిందని బిజెపి ఎంపి మనోజ్ తివారీ చెప్పారు.

2014లో అధికారానికి రాక ముందు పార్టీ పెద్దలు పలికిన సుభాషితాలను చూద్దాం. పెట్రోలు ధరలు పెంచటం యుపిఎ సర్కార్ ప్రాధమిక వైఫల్యానికి నిదర్శనమని, సమావేశాలు ముగిసిన తరువాత చేయటం పార్లమెంటును అగౌరవ పరచటమే అని, పెంపుదల వలన గుజరాత్ జనాలపై వందల కోట్ల భారం పడుతుందని 2012 మే 23వ తేదీన గుజరాత్ సిఎంగా నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.ఇప్పుడు అదే మోడీ ఏలుబడిలో ధరల పెంపుదలకు అసలు పార్లమెంటుతోనే పని లేదు.
గ్యాస్ సిలిండర్లు పట్టుకొని వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసిన బిజెపి నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గారేమన్నారంటే 2011 జూన్ 24న ఒక ట్వీట్ చేస్తూ ఆవ్‌ుఆద్మీ సర్కార్ అని చెప్పుకొనే యుపిఎ సర్కార్ గ్యాస్ బండమీద రూ. 50 పెంపు ఎంత సిగ్గుచేటు అన్నారు. 2012 డిసెంబరు 24న మరొక ట్వీట్‌లో యుపిఎ దృష్టిలో జిడిపి వృద్ధి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రశ్నించిన వారి మీద ఆమె మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చకపోతే పొలిటీషియన్లు కాదన్న గిరీశాన్ని బిజెపి నేతలు గుర్తుకు తెస్తున్నారు.

ధరల పెరుగుదల ప్రభుత్వ వైఫల్యమని 2014కు ముందు చెప్పిన వారు ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితుల మీద నెపాన్ని మోపుతున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్‌ను ఆదర్శంగా తీసుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ కూడా నెహ్రూను వదలిపెట్టలేదు. కాంగ్రెస్ వారిని ఎద్దేవా చేస్తూ “చివరికి 1951లో కూడా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారత ద్రవ్యోల్బణాన్ని కొరియా యుద్ధం ప్రభావితం చేసిందని చెప్పి ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం విశ్వవ్యాప్తంగా అనుసంధానమై ఉంది కనుక ఉక్రెయిన్ మనలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నాం, అంగీకరించరా” అన్నారు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి మాట్లాడుతూ మధ్యతరగతి వారు కష్టాలను భరించి కరోనా వ్యాక్సిన్లు అందచేసేందుకు ప్రభుత్వానికి తోడ్పడాలని చెప్పారు. టాక్సులు లేకపోతే చమురు ధరలు ఎక్కువ కాదు. మీరు మాత్రం ఉచితంగా వ్యాక్సిన్లు పొందాలి, మరి వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మీరేమీ చెల్లించలేదు, అందుకే ఈ విధంగా వసూలు చేస్తున్నాం” అన్నారు. జనానికి తెలివి తేటలుంటాయని వారు గనుక భావించి ఉంటే ఇంతగా బరితెగించి అడ్డగోలు వాదనలు చేసే వారు.గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో ఏం జరిగినా ఆ ఘనత నరేంద్ర మోడీదే, చివరికి పొద్దు పొడుస్తుందన్నా, చీకటి పడుతుందన్నా మోడీ అధికారానికి వచ్చిన నాటి నుంచే జరుగుతోందని చెప్పేవారు మనకు కనిపిస్తారు. నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ కంగన రనౌత్ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. పోనీ భక్తుల కోరిక మేరకు జరిగిన వాటన్నింటినీ నరేంద్ర మోడీ ఖాతాలోనే వేద్దాం. మరి ఇప్పుడు ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం? 1947 నుంచే ప్రారంభమైందని, గాంధీ, నెహ్రూలే కారణం అని బిజెపి పెద్దలు సెలవిచ్చినా జనంనమ్మక తప్పదు, కాదంటే తంటా కొని తెచ్చుకోవటమే. అచ్చేదిన్ కనుక మౌనంగా భరిస్తున్నారు, ఏడవలేక నవ్వుతున్నారు !

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News