ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం దేశంలోని ప్రధాన సాంకేతిక పరిజ్ఞాన సంస్థల డైరెక్టర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్ర ఆర్థిక సాయంతో నడిచే సాంకేతిక సంస్థలతో అన్ని అంశాలపై సమీక్షించారు. ఇప్పటి సవాళ్లు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అందరికీ వెసులుబాటుగా ఉండే విద్యా విధానాలను ఇప్పుడు అన్వేషించాల్సి ఉందని సూచించారు. ఈ దశాబ్దాన్ని మనం సాంకేతిక పరిజ్ఞానం కీలకమైన దశగా పరిగణిస్తున్నామని, దీనిని ఇండియా టెకెడ్‌గా పిలుచుకుంటున్నామని తెలిపారు. విద్యా బోధన విషయాలలో చాలా మార్పులు ఇప్పటి కీలక సవాళ్ల నేపథ్యంలో చోటుచేసుకున్నాయి. తరువాతి దశను కూడా మనం పరిగణనలోకి తీసుకుని తీరాలి.
ఈ విధంగా నూతన విద్యా విధాన పద్థతులను మల్చుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాంకేతిక, పరిశోధనా ప్రగతి అనుబంధ సంస్థలు (ఆర్ అండ్ డి) ఈ దిశలో అత్యంత కీలక పాత్ర వహిస్తాయని ప్రధాని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంద సంస్థల అధినేతలతో సమీక్ష నిర్వహించారు. విద్యారంగాన్ని మనం సామాజిక వనరుగా గుర్తించాలని, అందుబాటు, అమరిక, సమానత, ప్రామాణికతలు కీలకంగా ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త సృజనాత్మక విద్యావిధానాలను రూపొందించాల్సి ఉందన్నారు.