న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ గురువారం హర్షధ్వానాల మధ్య తన మంత్రిమండలిని రాజ్యసభకు పరిచయం చేశారు. బుధవారం నాడు స్పీకర్ ఎన్నిక జరిగిన తరువాత లోక్‌సభకు మంత్రులను పరిచయం చేసిన ప్రధాని మోడీ గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ఢంకర్ ్ర ఆరు దశాబ్దాల తరువాత మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేశారని అభివర్ణించారు.
ఆ తరువాత సభకు మంత్రులను పరిచయం చేయాలని ప్రధాని మోడీని అభ్యర్థించారు. సభాపక్ష నాయకుడు జెపి నడ్డా, రాజ్యసభ లోని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ 264 సమావేశానికి గురువారం తొలిరోజు కావడం విశేషం. పార్లమెంట్‌లోని ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని రాజ్యసభ ముందుంచారు. దీనిపై చర్చలు సాగిన తరువాత కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం ఆమోదిస్తారు.