Monday, December 23, 2024

ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలకోరు: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ మధ్యప్రదేశ్ బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన ఆరోపణలు ఆయన పచ్చి అబద్ధాలకోరని రుజువు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మంగళవారం నాడిక్కడ విలేకలతో మాట్లాడుతూ మధ్యప్రదేశ్ బహిరంగ సభలో 51 నిమిషాల పాటు ప్రసంగించిన మోడీ కాంగ్రెస్ పేరును 44 సార్లు స్మరించారని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర ప్రజలకు చేసిందేమిటో ఒక్క ముక్క కూడా ప్రధాని చెప్పలేకపోయారని ఆయన ఆరోపించారు. ఎఐఎడిఎంకె తరహాలోనే ఇతర పార్టీలు కూడా బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమిని వీడడం ఖాయమని, ఇప్పటికే చాలా పార్టీలు కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయని ఖేరా తెలిపారు.

లోక్‌సభలో, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిందంటూ ప్రధాని మోడీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రధాని నోరు విప్పితే అబద్ధాలు తప్ప మరేమీ రావని ఖేరా విమర్శించారు. 1989 లో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లును తీసుకువచ్చన ఘనత రాజీవ్ గాంధీ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. నాలుగు వోట్లు తగ్గడంతో బిల్లు రాజ్యసభలో వీగిపోయిందని, ఆ బిల్లును అప్పటి బిజెపి ఎంపీలు ఎబి వాజపేయి, ఎల్‌కె అద్వానీ, రాం జెత్మలాని, జస్వంత్ సింగ్ వ్యతిరేకించారని ఖేరా గుర్తు చేశారు.

గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఆమోదం పొందిన ఈ బిల్లు అచట్టంగా అమలులోకి రావడానికి పదేళ్లు పడుతుందని ఆయన చెప్పారు. మోడీ ఉద్దేశం కూడా అదేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త పార్లమెంట్‌లో ప్రవేశం దక్కడం లేదని ఖేరా ఆరోపించారు. సినీ తారలను కొత్త పార్లమెంట్‌కు ఆహ్వానిస్తున్నారు కాని రాష్ట్రపతిని మాత్రం ఆహ్వానించడం లేదని ఆయన విమర్శించారు. ఈ కారణంగానే ప్రధాని మోడీని కులతత్వవాది అని రాహుల్ గాంధీ అంటారని, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ప్రధాని మోడీ వ్యతిరేకమని ఖేరా ఆరోపించారు.

ఓటమి భయంతోనే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలను బిజెపి బరిలోకి దింపుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఎనిమిదేళ్లుగా త్రమను పట్టించుకోని బిజెపికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News