Wednesday, January 22, 2025

తెలంగాణకు పెట్టుబడులను అడ్డుకుంటున్న మోడీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాళ్ళడ్డుతోందని తెలంగాణ రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.ఇప్పటికే నిధులు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న కేంద్రం ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటోందన్నారు. అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారు అయిన (బివైడి) హైదరాబాదులో ఏర్పాటు చేయాలనుకున్న తయారీ విభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలిపారు.బివైడి సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీలను కూడా తయారు చేస్తోందని, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి మంచి పేరు ఉండటమే కాకుండా మన దేశంలోనూ బివైడి వాహనాల అమ్మకాలు భారీగానే ఉన్నాయన్నారు.

హైదరాబాద్ లో రూ. 8 వేల కోట్లతో తమ పరిశ్రమ ఏర్పాటు చేసి ఏటా 10 నుంచి 15 వేల వాహనాలు తయారు చేయాలని నిర్ణయించి, అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోగా కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అనుమతులు నిరాకరించిందని ఆరోపించారు.

పరిశ్రమను గుజరాత్ లో కాకుండా హైదరాబాదులో ఏర్పాటు చేయబోతున్నారన్న కారణంతోనే అనుమతులు ఇవ్వలేదని అనుమానాలు కలుగుతున్నాయన్న ఆయన కేంద్రం తీరుతో తెలంగాణ యువతకు రావాల్సిన వేలాది ఉద్యోగాలు రాకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు భారత్ ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకోవడంతో ధరలు కూడా అధికంగా ఉన్నాయని,అదే మన దగ్గరే వాహనాలు తయారైతే ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ కేంద్రం ఇవేవి పట్టించుకోలేదన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహకాల వినియోగాన్ని పెంచాలని చెబుతున్న కేంద్రం ఇలాంటి నిర్ణయాలతో దానికి తూట్లు పొడుస్తోందన్నారు.ఇప్పటికే సోలార్ ప్యానల్స్ పై జీఎస్టీని, దిగుమతి సుంకాన్ని భారీగా పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసిందన్నారు. కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రిక్ వాహనాల పైన ఇన్సెంటివ్ ను ఎత్తేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు రావాలనుకున్న సంస్థకు రెడ్ సిగ్నల్ వేసిందని ఆయన ఆరోపించారు. 2030 కల్లా దేశంలోని వాహనాల్లో 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. కానీ అది కాగితాలకే పరిమితమవుతోందన్నారు.కనీసం బివైడి సంస్థకు అనుమతి ఇచ్చి ఉంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత వేగంగా పూర్తయ్యేదన్నారు.ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న 50 పట్టణాల్లో 39 పట్టణాలు భారతదేశంలోనే ఉన్నాయని ఆ పట్టణాలను కాలుష్యం నుంచి కాపాడుకునేందుకైనా కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వేలాదిమంది ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. వాహనాలు ఇక్కడే తయారైతే మరింత తక్కువ ధరకు వచ్చేవని ఆశపడిన వాహనప్రియుల ఆశలకు గండి కొట్టింది.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని ఈవీ తయారీ సంస్థకు అనుమతులిచ్చి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News