Thursday, January 23, 2025

విద్వేషంతోనే విపక్షం విమర్శలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పాలనతో దేశం విలువైన దశాబ్ద కాలాన్ని నష్టపోయిందని విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో ఎదురుదాడికి దిగారు. విపక్షాల పాలనాకాలంలో దేశంలో జరిగిన పలు స్కామ్‌లతో దేశ ప్రతిష్ట దిగజారిందని విమర్శించారు. ఒక్కరోజు క్రితం లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలో అదానీ వ్యవహారంతో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని, దీనికి ప్రధాని మోడీ సహకారం ఉండే ఉంటుందని తీవ్రస్థాయిలో ఆరోపించిన దశలో ప్రధాని మోడీ బుధవారం మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో ప్రధాని మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకూ యుపిఎ హయాంలో స్కామ్‌లు అనేకం జరిగాయని, ఈ విధంగా ఇది స్కామ్‌ల దశాబ్ధం అయిందని తెలిపారు. దేశానికి కలిసివచ్చిన పలు అవకాశాలను యుపిఎ తన స్వార్థంతో స్కామ్‌లతో చివరికి సంక్షోభాలలోకి నెట్టిందని విమర్శించారు. జరిగిన అవినీతి వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు ఇతర దర్యాప్తు సంస్థల విచారణ క్రమంతో బెంబేలెత్తుతున్న విపక్షాలు ఇప్పుడు ఏకం అవుతున్నాయని, ఈ విధంగా ఓటర్ల వల్ల కాకుండా ఇడి వల్ల విపక్షాలు ఒక్కగూటికి చేరుతున్నాయని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు మోడీని ద్వేషించడమే పని అని, అయితే దేశంలోని 140 కోట్ల మంది మోడీకి రక్షణ కవచంగా ఉన్నారని, విమర్శలు అనుచిత ఆరోపణలు తనను ఏమి చేయలేవని మోడీ ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలకు పలు విధాలుగా నిరాశ నిస్పృహ ఏర్పడిందని , ఈ దేశంఇటీవలి కాలంలో సాధిస్తున్న ప్రగతితో వారు జీర్ణించుకోలేకపోతున్నారని , ఈ విధంగా ప్రగతి చెందడం సహించలేక విద్వేషప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌పై ఇంతకు ముందు ఎప్పుడూ లేని స్థాయిలో ప్రధాని మోడీ ఈసారి ఆవేశంతో మండిపడ్డారు. ఒక్కరోజు క్రితం పార్లమెంట్‌లో హార్వార్డ్‌పై చర్చ , ఈ దశలో తనను లక్షంగా ఎంచుకుని దాడి జరుగుతుందని అనుకున్నది నిజంగానే జరిగిందని వ్యాఖ్యానించారు.

విపక్షాలు గత తొమ్మిదేళ్లుగా నిర్మాణాత్మక విమర్శలకు కాకుండా, కల్పిత పనిగట్టుకుని సాగించే దూషణలకు దిగుతున్నాయని ,కొందరికి కేవలం మోడీని తిడితే తమ సమస్య పరిష్కారం అయిపోతుందనే రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రధాని ఈ సందర్భంగా రాహుల్‌పై దాడికి దిగారు. తమ హయాంలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని, దీనిని చూసి ఓర్వలేకనే కొందరు పనిగట్టుకుని విమర్శలకు దిగుతున్నారని, పైగా కొందరు రాష్ట్రపతిని అవమానించేలా తీవ్రవ్యాఖ్యలకు దిగారని , కొందరు ఏకంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని మోడీ చెప్పారు. కొందరు చేసిన ప్రసంగాలతో వారిలోని అసమర్థత , విద్వేషం వెలుగులోకి వచ్చిందని మోడీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News