సిలిగురి: ప్రధాని మోడీ ప్రజలను మోసపూరిత అసత్యాలతో మభ్యపెడుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. ఇక్కడ ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోడీకి ఏళ్ల తరబడిగా అసత్యాలతో మేడలు కట్టడం పరిపాటి అయిందన్నారు. ఎన్నికలు జరిగే బెంగాల్‌లో ఓటర్లను పక్కదోవ పట్టించేందుకు గారడీలు చేస్తున్నారని ప్రధానిని టార్గెట్‌గా చేసుకుని మండిపడ్డారు. ప్రజలు ఎంతకాలం వట్టి మాటల ప్రధానిని నమ్ముతారని ప్రశ్నించారు. ధరలు పెరుగుతున్నాయని, అయితే ఇప్పటికీ ప్రధాని మోడీ పౌరుల ఖాతాల్లో వాగ్దానం చేసినట్లుగా రూ 15 లక్షలు వేయలేదన్నారు. ప్రతి వ్యక్తికి అందుబాటు ధరలలో వంటగ్యాసు సిలిండరు అందాల్సి ఉంది, అయితే ఇప్పుడు కేంద్రం చర్యలతో సామాన్యుడికి ఇది తలకు మించిన భారం అయిందన్నారు.
ఎంతకాలం ఈ విధంగా అబద్థాలు చెపుతారు? సిగ్గన్పించడం లేదా? అని ప్రధానిని మమత ఘాటుగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు తరచూ బంగ్లాలో మాట్లాడుతున్నట్లుగా నటిస్తుంటాడని, అయితే ప్రసంగ భాగం బంగాళీలో ఉంటుంది కానీ రాత ఆయన గుజరాతీ భాషలో ఉంటుందని మమత తెలిపారు. తన ముందు ఎప్పుడూ పారదర్శకత అద్దాలు పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తారని, బెంగాల్ భాష బాగా తెలుసుననే విధంగా మాట్లాడుతాడని తెలిపారు. ఆయన పార్టీ వారు విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిందని, బిర్సాముండాను అగౌరవపర్చిందని, ఈ పార్టీ వారు రవీంద్రుడు శాంతినికేతన్‌లో పుట్టారని అన్నారు. వీరి బెంగాలీ పరిజ్ఞానం ఏమిటనేది తెలుసుకోవాలని మమత కోరారు.