లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధికి పునాది వేసింది ప్రధాని నరేంద్ర మోడీయేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం రాష్ట్రం లోని భాగ్‌పట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. బీఎస్పీ, ఎస్పీ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీజేపీ వచ్చిన తర్వాతనే రాష్ట్రాభివృద్ధి ప్రారంభమైందని చెప్పారు. ఇందుకు నిదర్శనం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణమని అన్నారు. 70 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ లోని 1.82 కోట్ల మంది పేద ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదు. కానీ మోడీ ప్రధాని అయ్యాక వారికి విద్యుత్ అందుబాటు లోకి వచ్చింది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పట్ల మోడీ గొప్ప విజన్ ఉంది. ఆ విజన్ నుంచి వచ్చినవే గంగా ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ హైవే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేలని అమిత్‌షా అన్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికలు కొందరికి తమ రాజకీయ భవిష్యత్‌లా చూస్తున్నాయని , వాస్తవానికి ఇవి ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించేవని షా చెప్పారు.