Wednesday, January 22, 2025

అబద్ధాల మోడీ

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో బిజెపిని నిండా ముంచిన ఘనుడు

కామారెడ్డిలో మోడీపై ధ్వజమెత్తిన కర్నాటక సిఎం
కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ ఆవిష్కరించిన సిద్ధరామయ్య

మన తెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి : ప్రధాని మోడీని మించిన అబద్ధాల కోరు ఎవరూ లేరని, తెలంగాణలో మోడీపై ఆధారపడి బిజెపి పోటీ చేస్తుందని నాలుగు సీట్లు కూడా రావడం కష్టమని కర్నాటక సిఎం సిద్ధరామయ్య అన్నారు. తెలంగాణలో బిజెపి అభ్యర్థులకు కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశముందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కర్నాటక సిఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బిసి డిక్లరేషన్ సభలో ఆయన మాట్లాడుతూ మోడీ ని నమ్ముకొని కర్నాటకలో బిజెపి నిండా మునిగిందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ 48చోట్ల సభలు నిర్వహిస్తే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిందన్నారు. అక్కడ మా ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని, వాటి అమలు తీరును ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చునని తెలియజేశారు. అదే విధంగా సిద్ధరామయ్య బిసి డిక్లరేషన్‌ను ప్రకటించారు.

బిసి.డిలో ఉన్న ముదిరాజ్ కులస్థులను బిసి.ఎ లో చేరుస్తున్నామని, జనాభా ప్రాతిపదికన బిసి  రిజరేషన్లు కల్పిస్తామన్నారు. ఐదేళ్లలో బిసిల అభ్యున్నతి కోసం రూ. 5లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని, బిసి కార్పొరేషన్ ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థలో 23 శాతం ఉన్న రిజరేషన్లను 42 శాతానికి పెంచుతామన్నారు. అదే విధంగా 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పింఛన్ అందజేస్తామని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

అనంతరం టిపిసిసి ఛీప్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రాంతంలో 22 వ ప్యాకేజీ ద్వారా మూడు సంవత్సరాలలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కర్ణాటక మంత్రులు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, సిపిఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాణిక్‌రావు థాక్రే, షబ్బీర్ అలీ, ఈరవత్రి అనిల్, పొన్నం ప్ర భాకర్, అరికెల నర్సారెడ్డి, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, యూసుఫ్‌అలీ, ఆకుల లలిత, మానాల మోహన్‌రెడ్డి, మధుయాష్కిగౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కైలాస్ శ్రీనివాస్, పండ్ల రాజులతోపాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News