Tuesday, September 17, 2024

సింగపూర్.. ఓ గ్లోబల్ మోడల్: ప్రదాని మోడీ

- Advertisement -
- Advertisement -

సింగపూర్: ప్రపంచవ్యాప్త స్ఫూర్తిదాయక వేదికగా సింగపూర్ నిలుస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశసించారు. సింగపూర్‌లో పర్యటన సందర్భంగా ఆయన గురువారం దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సమావేశం అయ్యారు. సింగపూర్ 4జి నాయకత్వ పటిమ ఎనలేనిదని, ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ ఓ మోడల్ అవుతుందన్నారు.

ఈ క్రమంలో ఈ నగర దేశపు నాలుగోతరం నాయకత్వం ఎనలేని విధంగా పాటుపడుతోందని ప్రశసించారు. దేశ ప్రధాని వాంగ్‌ను అభినందించారు. ఓ సుభిక్ష దేశానికి నాయకత్వ అవకాశం దక్కించుకున్నారని పేర్కొన్నారు. వాంగ్ సింగపూర్ ప్రధాని అయిన తరువాత ఆయనతో మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి. తొలిసారిగా ఈ నేపథ్యంలో మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 4జి నాయకత్వ పటిమతో సింగపూర్ మరెన్నో మైలురాళ్లను అధిగమించి తీరుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ (పిఎపి) నేత అయిన ప్రధాని వాంగ్ వృతిరీత్యా ముందు ఆర్థికవేత్త, ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి నాయకత్వంతో సింగపూర్ మరింత పురోగతిని సాధిస్తుందని మోడీ కితాబు ఇచ్చారు.

ప్రధాని మోడీ బుధవారం సింగపూర్‌కు వచ్చారు. తాను ఇక్కడికి వచ్చింది కేవలం ఓ మిత్రపక్ష దేశం, భాగస్వామ్య పక్షంతో చర్చలకు కాదని , వర్థమాన దేశాలకు స్ఫూర్తిదాయకమైన సింగపూర్‌కు భారతదేశ గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇండియాలో మల్టీపుల్ సింగపూర్‌ను సృస్టించే క్రమంలో మంత్రిత్వ స్థాయి అఖిలపక్ష సమావేశాలు తరచూ జరుగుతాయని వివరించారు. ఈ ప్రక్రియ అత్యంత వినూత్నం అని తెలిపారు. అన్నింటికి మించి భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీకి సింగపూర్ ప్రధాన అనుసంధాన పాత్ర వహిస్తుందని వాంగ్‌తో చర్చల దశలో మోడీ చెప్పారు. గత పది సంవత్సరాలుగా ఇరుదేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు ఇనుమడించామని, పరస్పర పెట్టుబడుల శాతం కూడా పెరిగిందని తెలిపారు. ఇది మూడింతలై, ఇప్పుడు 150 బిలియన్ డాలర్లకు చేరిందని ప్రకటించారు.

ఇక భారత అంతరిక్ష సంస్థ ఇస్రో శాటిలైట్ల అనుసంధానంగా సింగపూర్‌కు చెందిన 17 నానో శాటిలైట్లను భారత అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇది నిజంగానే ఇరు దేశాల మధ్య పటిష్ట బంధం క్షేత్రస్థాయి నుంచి అంతరిక్షం వరకూ విస్తరించిన క్రమాన్ని చాటిందన్నారు. సింగపూర్‌లో మూడున్నర లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరు ఇరుదేశాల మధ్య పటిష్ట స్నేహ బంధపు వారధిగా మారారని కొనియాడారు. నేతాజీసుభాష్ చంద్రబోస్ , ఆజాద్ హిందూఫౌజ్‌లకు ఈ వేదిక సముచిత గౌరవం కల్పించిందని, అదే విధంగా ఇక్కడ మినీభారత్‌కు ఆదరణ దక్కిందని చెప్పారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో సింగపూర్‌లో తిరువళ్లూరు కల్చరల్ సెంటర్, ఇన్వెస్ట్ ఇండియా ఆఫీసు ఏర్పాటుకు ఆమోదం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News