న్యూఢిల్లీ : భారత్, ఇండోనేషియా మొత్తంగా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు ఇవ్వడానికి శనివారం అంగీకరించాయి. ముఖ్యంగా రక్షణ ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సంయుక్తంగా కృషి చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతోకు ఆతిథ్యం ఇచ్చారు. ఉభయులూ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. మూడు రోజుల పర్యటనపై భారత్‌కు వచ్చిన సుబియాంతో ఆదివారం ఢిల్లీ కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సుబియాంతోతోచర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ ఇండోనేషియాను పది దేశాల ఆసియన్ కూటమిలోను, ఇండో పసిఫిక్ ప్రాంతంలోను భారత్‌కు ‘ముఖ్యమైన భాగస్వామిగా అభివర్ణించారు. ఈ ప్రాంతంలో నిబంధనల ఆధారిత వ్యవస్థకు రెండు దేశాలు నిబద్ధమై ఉన్నాయని ఆయన చెప్పారు.
‘నౌకాయాన స్వేచ్ఛ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉండేలా చూడాలని మేము అంగీకరిస్తున్నాం’ అని మోడీ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా తన సైనిక దళ బలాన్ని పెంచుకుంటుండడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకు ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు.‘మా ద్వైపాక్షిక సంబంధాల పరంగా వివిధ అంశాలపై మేము విస్తృతంగా చర్చలు జరిపాం’ అని ప్రధాని తెలియజేశారు. రక్షణ ఉత్పత్తి, సరఫరా రంగాలపై సంయుక్తంగా కృషి చేయడానికి భారత్, ఇండోనేషియా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. సాగరప్రాంత భద్రత రంగంలో శనివారం భారత్, ఇండేనేషియా సంతకం చేసిన ఒప్పందం నేర నివారణ, సోదా, రక్షణ, సామర్థ నిర్మాణం అంశాల్లో సహకారాన్ని మరింత పటిష్ఠం చేస్తుందని మోడీ చెప్పారు. మొత్తంగా ఆర్థిక సంబంధాల పెంపుదలకు వాణిజ్య రంగం, మార్కెట్ సౌకర్యం విస్తరించవలసిన ఆవశ్యకత గురిచి రెండు పక్షాలు చర్చించినట్లు ఆయన తెలిపారు.
‘ఫిన్‌టెక్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్, డిజిటల్ సార్వత్రిక మౌలికవసతులు వంటి రంగాల్లో సహకారాన్ని పటిష్ఠం చేయాలని మేము నిర్ణయించాం’ అని ప్రధాని తెలియజేశారు. సాగర ప్రాంత భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, తీవ్రవాదం నుంచి విముక్తి అంశాల్లో సహకారానికి ఉభయ పక్షాలు ప్రాముఖ్యం ఇచ్చాయని మోడీ చెప్పారు. బ్రిక్స్‌లో ఇండోనేషియా సభ్యత్వాన్ని కూడా ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందం స్వాగతించింది. ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో మీడియాతో మాట్లాడుతూ, తమ చర్చలు ‘ఎటువంటి అరమరికలూ లేకుండా’ సాగాయని వెల్లడించారు. ఉమ్మడి ప్రయోజనకర కీలక రంగాలు పెక్కింటిలో సహకారం విస్తరణకు ఉభయ పక్షాలు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ‘భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యం పెంపు అవసరమని మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను’ అని సుబియాంతో తెలియజేశారు.