న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెల్లవారుజామున కాశీలో ఆకస్మిక పర్యటనలు జరిపారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలసి ప్రధాని మోడీ సోమవారం తాను ప్రారంభించిన కాశీ విశ్వనాథ ధామ్‌తోపాటు బనారస్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన కాశీలో ముఖ్యమైన అభివృద్ధి పనులను తాను తనిఖీ చేసినట్లు ప్రధాని మోడీ రాత్రి 1గంటకు ట్వీట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. 2014 నుంచి వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం వారణాసి చేరుకున్నారు. సోమవారం ఉదయం కాశీలోని కాల భైరవ మందిరాన్ని సందర్శించిన ఆయన మధ్యాహ్నం ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ కారిడార్ ప్రాజెక్టు కాశీ(విశ్వనాథ్ ధామ్) తొలి దశను ప్రారంభించారు. సాయంత్రం గంగానదిలో పడవలో విహరిస్తూ గంగా హారతిని, లైట్ అండ్ సౌండ్ షోను ఆయన వీక్షించారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఎస్‌పిజి భద్రతా సిబ్బంది వెంటరాగా గొడోలియా చౌక్ సమీపంలో వారణాసి వీధులలో ఆయన నడిచారు. ఈ పవిత్ర నగరంలో అత్యుత్తమ మౌలిక సౌకర్యాలు కల్పించడమే తన ఆకాంక్షని మోడీ ట్వీట్ చేశారు.
Modi Midnight inspection in Kashi Temple