జాతీయ భద్రత దేశ గౌరవాలకు ప్రాధాన్యత
సరైన పాలసీలతో సమగ్ర ప్రగతి
కాంగ్రెస్ హయాంలో మంత్రులంతా పిఎంలే
మన్మోహన్ కేవలం అనామక నేత
రూ 12లక్షల కోట్ల స్కామ్‌ల అప్రతిష్ట
వ్యవస్థను మలుపు తిప్పిన ఘనత మోడీదే
కీలక సదస్సులో అమిత్ షా ప్రశంసా విశ్లేషణ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో సరితూగే పరిపాలనదక్షులు దేశంలో ఇంతవరకూ లేరని హోం మంత్రి అమిత్ షా కితాబు ఇచ్చారు. స్వాతంత్య్ర భారతంలో అత్యంత విజయవంతమైన అడ్మినిస్ట్రేటర్‌గా ప్రధాని మోడీ నిలిచారని తెలిపారు. దేశం ఇటువంటి నేతను ఇప్పటివరకూ చూడలేదన్నారు. ‘ప్రజాస్వామికత : ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీ రెండు దశాబ్దాల హయాం’ అనే అంశంపై జరిగిన సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. భారతదేశాన్ని ప్రధాని మోడీ విభిన్న దశకు తీసుకువెళ్లారు. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, విదేశాంగ విధానాల వంటి పలు అంశాలలో పలు సత్ఫలితాలు ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. సమగ్ర ప్రణాళికలతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం కార్యదక్షతతోనే సాధ్యం అవుతుంది. ఈ విధంగా ఈ కోణంలో ప్రధాని మోడీ ఉత్తమ పరిపాలనదక్షులు అని తెలిపారు. జాతీయ భద్రతను, ప్రగతిని సమన్వయపర్చుకుంటూ సాగడం కీలకం అన్నారు.
మోడీ రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ సిఎం అయినప్పుడు ఆయనకు పరిపాలనా వ్యవహారాల గత అనుభవం లేదని, అయితే ఆ దశలో ఆయన పలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా పరిపాలనను సవ్యంగా పరగులు పెట్టించారని తెలిపారు. ఇక కేంద్రంలో ఆయన ప్రధాని పదవికి వచ్చిన దశలో పరిస్థితి గందరగోళంగా ఉండేదన్నారు. 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని చోట్లా విధాన లోపాలు, అచేతనావస్థలు ఉండేవని తెలిపారు. అప్పట్లో ప్రతి మంత్రి తనకు తాను ప్రధానిగా భావించుకునే వారు. ఈ దశలో అసలు ప్రధానిని ప్రధానిగా పరిగణించేవారు కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో దేశానికి జాతీయ భద్రతా పాలసీ లేదు. ఇక పలు స్కామ్‌లతో ఇండియా ప్రతిష్ట అంతర్జాతీయగా దిగజారింది. అప్పట్లో దాదాపుగా రూ 12 లక్షల కోట్ల మేర స్కామ్‌లు జరిగాయి. అవినీతిభరిత అధికారిక వ్యవస్థతో పాలసీలు కార్యాచరణ లేక కుంటుపడ్డాయని వ్యాఖ్యానించారు. ఓ దశలో సర్కారు తీరు తెన్నులతో ఇక ప్రజాస్వామ్యం పతనం చెందుతుందా? అనే భావన తలెత్తిందని అమిత్ షా విశ్లేషించారు.
అయితే ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలలో కూడా నమ్మకం ఏర్పడింది. ఇక పరిస్థితులు మారుతాయనే ఆశ తలెత్తింది. వ్యవస్థ కుదుటపడుతుందనే భావన నెలకొందన్నారు. వీటిని ప్రధాని మోడీ నిజం చేశారన్నారు. భారతదేశం సమస్యలు కేవలం పాలనా సంబంధితం లేదా ఆర్థిక సంబంధాలు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇవి సవ్యంగా ఉండాల్సిందే. అయితే అన్నింటికి మించి ఉండాల్సింది దేశ గౌరవం కాపాడటం అని, దేశ సంస్కృతి వ్యవహారాలను నిలబెట్టడం, మన భద్రతా పటిష్టతను పెంచడం అని , దేశం కోసం ఎవరేమి చేశారనేది ఈ కోణం నుంచి చూడాల్సి ఉందన్నారు. ప్రగతి, వారసత్వ క్రమం, భద్రత వంటివి సమన్వయపర్చుకుంటూ అంతర్లీనంగా దేశ గౌరవాన్ని పెంపొందింపచేసే క్రమం కీలకం అన్నారు. ఇందుకు ఇంతకుముందు కన్నా భిన్నమైన దృక్పథం, ఆచరణ అవసరం అని, ఇది కేవలం ప్రజాదరణగల నేతతోనే సాధ్యం అవుతుందన్నారు.
క్షేత్రస్థాయి వాస్తవికులే గొప్పనేతలు
నేలపై క్షేత్రస్థాయి వేళ్లతో ముడివడి ఉన్న నేత, పేదల బాధల ఆకళింపు గల నేత అయి ఉండాలి. అత్యంత నిరుపేదలు కూడా ప్రగతి ఫలాలను పొందగల్గాలని అన్నారు. ఏ దశలోనూ దేశ జాతీయ భద్రతా వ్యవస్థపై ప్రజల విశ్వాసం సడలిపోరాదని అన్నారు. అణగారిన వర్గాలలో అట్టడుగు స్థాయి వారు కూడా కూడా గుండెమీద చేయివేసుకుని చింతలులేని స్థితిని కల్పించే స్థాయి గల వాడే నిజమైన నాయకుడు అవుతారని విశ్లేషించారు. ఇప్పటికీ ప్రధాని మోడీ తనను తాను ప్రధాన సేవక్ అని తెలియచేసుకుంటుంటారు. అయితే ఆయన అత్యంత విజయవంతమైన పాలనను అందించిన నేతగా తాను ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు. గత ఏడేళ్లలో ప్రధాని తీసుకుంటూ వచ్చిన వరసక్రమపు కీలక నిర్ణయాలను అమిత్ షా ప్రస్తావించారు.
పెద్దనోట్ల రద్దు, ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేక చట్టం, వంటి పలు అంశాలు ఉన్నాయని, అనేకం పార్టీ ప్రయోజనాలకు కూడా రిస్క్ స్థాయిలో ఉన్నవే అని, అయితే కీలక నిర్ణయాలను ప్రజలు బలపర్చారని , ప్రధాని వెంట నిలిచారని తెలిపారు. అంతా వీటిని ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అనుకోవచ్చు, అయితే జాతీయ భద్రతల నిర్ణయాలుగా కూడా వీటిని పరిగణనలోకి తీసుకుని తీరాల్సిందే అన్నారు. మోడీకి ముందు దేశానికి సరైన భద్రతా విధానం లేదని, ఇది ఎప్పుడూ విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఉంటూ నీలినీడలు పర్చుకుని ఉండేదన్నారు. ప్రధాని మోడీ అత్యంత స్పష్టమైన రీతిలో జాతీయ భద్రతా పాలసీని, విదేశాంగ విధానం నుంచి విడగొట్టారని, భారత్ స్నేహానికి విలువ ఇస్తుంది. అయితే దేశ సార్వభౌమాధికారంపై జరిగే ఎటువంటి అతిక్రమణను అయినా సహించేది లేదని, ఇతర దేశాలతో స్నేహాన్ని ఈ ప్రత్యేక అంశం పరిధిలోనే చూస్తుందని తన కార్యాచరణతో ప్రధాని రుజువు చేశారని అన్నారు. విద్యా వాణిజ్య వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు కీలకమైనవి, విజయవంతం అయ్యాయని తెలిపారు.