న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబానికి చెందిన తాను ప్రధానమంత్రి పదవిని చేరుకోవడానికి ఎదిగిన క్రమంలో తన జీవితాన్ని తీర్చిదిద్దడంలో తన తల్లి హీరాబెన్ ప్రభావం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తరచూ చెబుతుంటారు. ఈ ఏడాది జూన్ 18న శతవసంతంలోకి ప్రవేశించిన హీరాబెన్ శుక్రవారం కన్నుమూశారు. తల్లితో తన అనుబంధాన్ని, తన, ఆమె తన పిల్లల కోసం చేసిన త్యాగాలను, ఎదురీదిన కష్టాలను, ఆమె ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రధాని మోడీ తన బ్లాగ్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. పాఠశాలకు వెళ్లి చదువుకోకపోయినా జ్ఞానాన్ని పొందడం సాధ్యమేనన్న విషయం తన తల్లి తనకు నేర్పిన జీవిత పాఠమని మోడీ తెలిపారు.
తన తల్లి కూడా అందరి తల్లులలాగే చూసేందుకు సాధారణ వ్యక్తిలా కనిపించినా అసాధారణ వ్యక్తని ఆయన తన బ్లాగ్‌లో రాశారు. తన ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు ప్రేరణ తన తల్లి ఎప్పుడూ ఆకాంక్షించే గరీబ్ కల్యాణ్(పేదల సంక్షేమం) అని ఆయన పేర్కొన్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్లినపుడు ఆమె అన్న మాటలు తనకిప్పుడూ గుర్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో పనిచేయాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు తెలియదు కాని లంచం మాత్రం ఎన్నడూ తీసుకోవద్దు అని తల్లి అన్న మాటలను మోడీ గుర్తు చేసుకున్నారు.
తనకు చదువునేర్పిన గురువులను ప్రజల సమక్షంలో సన్మానించాలని తాను భావించానని, అందులో అతి మఖ్యమైన గురువు తన తల్లి కూడా ఉన్నారని మోడీ తెలిపారు. అయితే, తన కోరికను తన తల్లి తిరస్కరించారని, తాను చాలా సాధారణ వ్యక్తినంటూ ఆమె సన్మానానికి అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. నీకు జన్మనిచ్చాను కాని ఆ దేవుడే నీకు జ్ఞానాన్ని ప్రసాదించి ఈ స్థాయికి తీసుకువచ్చాడు అని తన తల్లి అన్నారని ఆయన తెలిపారు. తన తల్లి ఆ సన్మాన కార్యక్రమానికి రానప్పటికీ తనకు చిన్నపుడు లెక్కలు నేర్పిన స్థానిక ఉపాధ్యాయుడు జేతాభాయ్ జోషి కుటుంబం నుంచి ఒకరిని అక్కడకు పంపడంలో తన తల్లి పాత్ర ఉందని ఆయన తెలిపారు. తన తల్లి దూరదృష్టి, ఆలోచనా ధోరణి తనను ఎప్పుడూ ఆశ్చర్యానికి లోను చేస్తాయని ఆయన పేర్కొన్నారు.