Thursday, January 23, 2025

మోడీ అధిక ప్రసంగం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, అది ఇక చచ్చిన పామేనని ప్రధాని మోడీ నిజంగానే భావిస్తూ వుంటే దానిని విమర్శించడం కోసం, శాపనార్థాలు పెట్టడం కోసం ఆయన తన ప్రసంగంలో అంత ఎక్కువ సమయాన్ని వినియోగించి వుండేవారు కాదనిపిస్తున్నది. తాము దేశాధికారాన్ని చేపట్టడానికి ముందు దశాబ్దాల పాటు తమ పార్టీ బిజెపి నామరూపాల్లేని గతాన్ని గడిపిన సంగతి మోడీకి తెలియదని అనుకోలేము.

ఏడేళ్ల పాలనలో ఎంతో నేర్చుకొని వుండవలసిన ప్రధాని మోడీ ఎందుకు అంతగా సంయమనం కోల్పోయారా అనే ప్రశ్న దేశంలో దాదాపు ప్రతి ఒక్కరిలో తలెత్తి వుంటుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేడు ఏమంత గొప్పగా లేదు. దాని ప్రగతి రేఖ దారుణంగా పతనమవుతున్న విషయం అందరికీ తెలుసు. దాని స్థానంలో ప్రాంతీయ పక్షాల బలమైన కూటమి కేంద్రంలో ముందుకు దూసుకొస్తున్న దృశ్యం కూడా కనిపిస్తున్నది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ శక్తి తిరుగులేని విధంగా అధికారానికి చేరువయ్యే అవకాశాలు కూడా స్పష్టపడుతున్నాయి. అటువంటప్పుడు ప్రధాని మోడీ పార్లమెంటులో కాంగ్రెస్‌ను పట్టుకొని అంతగా దుయ్యబట్టవలసిన అగత్యం ఏల కలిగిందో తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడిన తీరు ప్రధానిని బాధించి వుండవచ్చు. బిజెపి పాలనలో దేశం ధనిక, పేద అనే రెండు ఇండియాలుగా చీలిపోయిందని, ప్రధాని మోడీ తన విధానాలతో చైనా, పాకిస్తాన్‌లను మరింత చేరువ చేశారని మున్నగు విమర్శలను రాహుల్ గాంధీ గుప్పించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని వచ్చిన వార్తలు ఆయనను కలవర పెట్టి వుండవచ్చు.

అలాగే ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి ఆశాజనకంగా లేదని ఆంతరంగిక నిఘా నివేదికలేమైనా అంది వుండవచ్చు. లేకపోతే ప్రధాని మోడీ అంతగా అవధులు మీరి విరుచుకు పడవలసిన అవసరం గాని, గొంతు చించుకోవలసిన అక్కర గాని కనిపించడం లేదు. రాష్ట్రాలను కేంద్రంపైకి ఉసిగొల్పి కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజనను, చీలికలను ప్రోత్సహిస్తున్నదని అది ముక్కల చెక్కల (తుక్డే తుక్డే గ్యాంగ్) ముఠా నాయకురాలని ప్రధాని మోడీ విమర్శించారు. ఈ విభజన రాజకీయాలనేవి బిజెపికి వర్తించినంతగా మరే పార్టీకి అతకవు. దేశంలో మత చిచ్చు రగిలించి భిన్న వర్గాల ప్రజల మధ్య బిజెపి, సంఘ్ పరివార్ శక్తులు తెస్తున్న చీలికలు, పరస్పర ద్వేషకావేషాల కంటే మించి విభజన రాజకీయాలను వేరెవ్వరూ ప్రయోగించలేరు. అలాగే కొవిడ్ మొదటి, రెండవ వేవ్స్ సందర్భంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పోషించిన బాధ్యతాయుతమైన పాత్రను ప్రధాని మోడీ పార్లమెంటు ముఖంగా తప్పు పట్టిన తీరైతే పరమ జుగుపాకరంగా వుంది. మొదటి కొవిడ్ సందర్భంగా ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు యుపి, బీహార్‌లకు చెందిన వలస కార్మికులను పని కట్టుకొని సొంత రాష్ట్రాలకు తరలించి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా ప్రబలడానికి దోహదం చేశాయంటూ ప్రధాని చేసిన విమర్శ బొత్తిగా హేతుబద్ధంగా లేదు.

వాస్తవానికి కొవిడ్ తొలి రెండు దశల్లోనూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి వుండకపోతే దేశంలో అది మరింత విషాదానికి దోహదం చేసి వుండేది. కేంద్రంలోని తాము ఆకస్మిక, కఠినాతి కఠిన జాతీయ స్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించి నిశ్చితంగా విశ్రాంతి చిత్తగించిన భయంకర నేపథ్యంలో ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో చిన్న, పెద్ద పని స్థలాలు, పారిశ్రామిక, వ్యాపార కేంద్రాలు మూతపడిపోయి, చివరి దినాల భత్యాలు కూడా అందక వలస కార్మికులు చెప్పనలవికాని బాధలు అనుభవిస్తున్న తరుణంలో, చేతిలో చిల్లిగవ్వ లేకుండా, ప్రయాణం చేయడానికి బస్సులు, లారీలు, రైళ్లు మరేవీ నడవక వారు దిక్కు తోచని స్థితిలో వున్నప్పుడు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు, చలనచిత్ర నటుడు సోనూసూద్ వంటి కొందరు వ్యక్తులు చొరవ చూపి వారికి ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించి స్వస్థలాలకు చేర్చడం ఏ విధంగా తప్పుడు పని అవుతుందో, ఎంతగా బుర్రలు బద్దలు కొట్టుకున్నా ఎవరికీ అర్థం కాని విషయం.

కొవిడ్ మృతుల మృత దేహాలు గంగానదిలో తేలియాడిన హృదయ విదారక దృశ్యాలకు, ఆక్సిజన్ కొరతతో అనేక మంది రోగులు అకాల మృత్యు పాలైన ఘటనలకు ఎవరు కారకులో ప్రధాని గుర్తు చేసుకొని వుంటే బాగుండేది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న యుపి, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాలను ఆశించి ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై ఈ విమర్శ చేశారు తప్ప ఇతరత్రా ఇందులో పస ఏ కొంచెమూ కనిపించడం లేదు. ఇక తెలంగాణపై మోడీ అసంబద్ధ ప్రకటన సహజంగానే రాష్ట్ర ప్రజల నుంచి నేతల నుంచి తీవ్ర విమర్శలను ఆకర్షించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News