న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందిన ఏడాది లోపలే స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్‌ను తయారుచేయడంతోపాటు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇతర చర్యలను చేపట్టినందుకు భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సిఎస్‌ఐఆర్) సొసైటీ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ గత శతాబ్దంలో విదేశాలలో సాధించిన నూతన ఆవిష్కరణలను మన దేశం అందిపుచ్చుకోవడానికి చాలా సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చేదని, కాని ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఇతర దేశాలలోని శాస్త్రవేత్తలతో సమానంగా పరిశోధనలు సాగిస్తున్నారని అన్నారు. ఈ శతాబ్దంలో అత్యంత పెను సవాలును యావత్ ప్రపంచం ఎదుర్కోంటుందని ఆయన అన్నారు. ఒక ఏడాదిలోపలే వ్యాక్సిన్లు రూపొందించడం బహుశా ఎవరూ ఊహించి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాల సాధనకు కొవిడ్-19 సంక్షోభంతో కొంత వేగం తగ్గిందని, అయినప్పటికీ మన సంకల్పంలో ఎటువంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.