‘భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్ర మోడీ’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ‘భారత దేశభక్తుడు నరేంద్ర మోడీ’ అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్ర మోడీ దేశభక్తుడు అన్నది పుతిన్ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశ భక్తులం అని బిజెపివారు ఢంకా జాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటిష్ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు.
పద్మశ్రీ కంగనా రనౌత్ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్ర మోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపివారు చెప్పుకుంటున్నారు. ‘ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు.ఆర్ధికంగా, నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది. భవిష్యత్ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల వాస్తవం. బ్రిటీష్ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారే క్రమంలో భారత్ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు.
భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్ర మోడీ కోరారు.మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది’ అని పుతిన్ అన్నాడు. నరేంద్ర మోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం. నరేంద్ర మోడీతో చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవిలో ఉండగా ‘నరేంద్ర మోడీ భారత దేశ పిత’ అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు. 2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్ర మోడీ న్యూయార్క్ వెళ్లినపుడు డోనాల్డ్ ట్రంప్ వీర లెవెల్లో పొగిడి మునగ చెట్టెక్కించడమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్ కి బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది.
‘నరేంద్ర మోడీ పాలనకు ముందు నాకు భారత్ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా ఛిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒక దగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకే మాత్రం వినం’ అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా? బైడెన్ గెలుస్తాడని, ట్రంప్ మట్టి కరుస్తాడని నరేంద్ర మోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్ ట్రంప్ సర్కార్ అనేవారు కాదు.
నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారనికూడా రాశారు.‘మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజన్స్’ అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్ర మోడీ 71శాతంతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్ర మోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్ పొగిడాడు.
డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధాని (201016)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్ జరూర్ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెనెట్ మన ప్రధాని నరేంద్ర మోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ‘మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి’ అని బెనెట్ అనగానే నరేంద్ర మోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది. నరేంద్ర మోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి.
స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు. భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్ర మోడీని పుతిన్ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్ర మోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ధి కలిగినపుడు ఇలాంటివి సహజం.
భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలక వర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాడు సోవియట్ వైపు మొగ్గారు. దేశానికి లబ్ధి చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్ధిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్ర మోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్ పోస్టు పత్రిక నరేంద్ర మోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్ కంపెనీదే. ఆ కోపం అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు, డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా? ఇప్పుడు పుతిన్ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్ర మోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. గాల్వన్ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్ర మోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు.
చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్నది అమెరికా. తైవాన్ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్ర మోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్ర మోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం.
నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం. (దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్ రష్యన్ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి. ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారథులుగా దశాబ్దాల తరబడి (దీని అర్ధం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?
ఎం కోటేశ్వరరావు
8331013288