బీహార్ సిఎం నితీశ్ ఆశాభావం
పాట్నా: బీహార్ నుంచి వెళ్లిన అఖిలపక్షం చెప్పిన అంశాల్ని ప్రధాని మోడీ శ్రద్ధగా విన్నారని,సహజంగానే సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అన్నారు. సోమవారం బీహార్ నుంచి 10 పార్టీలకు చెందిన 11మంది ఎంఎల్‌ఎల బృందం నితీశ్ నేతృత్వంలో ప్రధాని మోడీతో భేటీయై ఒబిసి జనగణన జరపాలని డిమాండ్ చేసింది. పార్లమెంట్‌లో ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనలో ఎస్‌సి,ఎస్‌టిల జనాభాను మాత్రమే కులావారీగా గణిస్తామని, ఒబిసి జనగణన చేపట్టబోమని స్పష్టం చేయడంతో దేశవ్యాప్తంగా ఆ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. కులాలావారీ జనగణన చివరిసారి బ్రిటీష్ పాలనలో 1931లో జరిగింది. దాని ఆధారంగానే దేశవ్యాప్తంగా ఒబిసి రిజర్వేషన్లను కేంద్రం అమలు చేస్తోంది. ఇది కేవలం బీహారీల సమస్య మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా కులాలవారీ జనగణనపై డిమాండ్ ఉన్నదని నితీశ్ గుర్తు చేశారు. తమ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల మధ్య ఈ అంశంలో ఏకాభిప్రాయం ఉన్నదని ఆయన తెలిపారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ అభ్యర్థనమేరకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లేందుకు నితీశ్ అంగీకరించడం గమనార్హం.