మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తీర్పు ప్రధాని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాయకత్వం మధ్య తరచు నెలకొనే ఇబ్బందికర సంబంధాల్లో మరొక నిర్ణయాత్మక మార్పు తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. అయితే, గత దశాబ్దంలో వలె కాకుండా, ఈ దఫా ఆ ఒత్తిడి దశ మోడీకి అననుకూలంగా తేలికపడింది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే, చరిత్రలోకి అంటే, మోడీ 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన కాలానికి వెళ్లడం అవసరం. మోడీకి పూర్వం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుల్లో ఎవరో కొద్ది మంది మాత్రమే ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లుగా ఉన్నారు; అటువంటి కొద్ది మంది ప్రచారక్‌లలో అటల్ బిహారి వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, సుందర్ లాల్ పట్వా, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు.
1990 దశకం ద్వితీయార్ధంలో యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించినప్పుడు వాజ్‌పేయి ‘ఒకసారి ప్రచారక్ అయితే ఎల్లప్పుడూ ప్రచారక్’ అని గొప్పగా ప్రకటించారు. అయినప్పటికీ, ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంతో అంతగా సామరస్య పూర్వక సంబంధం లేదు. అదే విధంగా, మోడీ తన సాదా కుటుంబ నేపథ్యం గురించి, సాధారణ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్న రోజుల గురించి తరచు ప్రస్తావిస్తుండేవారు, పరిపాలన ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవడానికి తనకు వీలు కల్పిస్తూ సంస్థతో ప్రగాఢ అనుబంధం గురించి కూడా ఆయన బాహాటంగా చెబుతుండేవారు. ఆయన జీవిత కథ కోసం నేను పరిశోధన చేస్తున్నప్పుడు, తాను ‘సంస్థను నిర్వహించే మౌలిక నైపుణ్యాన్ని సంఘ్ నుంచి నేర్చుకున్నట్లు’, ‘ఒక బృందాన్ని గుర్తించడం, దానిని నిర్మించడం, పని జరిపేలా బృందాన్ని సిద్ధం చేయడం వంటి వాటికి అంగబలాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి’ శిక్షణ పొందిన కారణంగానే పరిపాలనకు చెందిన ఎత్తులు గ్రహించానని మోడీ నాతో చెప్పారు. అయితే, నేర్చుకున్న అన్ని పాఠాలను మరీ ముఖ్యంగా వ్యక్తికి తక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం, సంస్థ, పార్టీ లేదా ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం అనేవి అనుసరించాలని మోడీ కోరుకోలేదు.
కేశూభాయ్ పటేల్‌ను రాజీనామా చేయవలసిందిగా పార్టీ నాయకత్వం ఆదేశించిన తరువాత మోడీ సిఎం పదవిని అధిష్ఠించారు. పరివార్‌లో మామూలుగా జరిగేవి ఏవో ఆయనకు తెలుసు తుదకు వాజ్‌పేయి కూడా 1998లో తాను కోరుకున్న విధంగా చేయలేకపోయారు, జశ్వంత్ సింగ్, ప్రమోద్ మహాజన్ పోటీచేసిన లోక్‌సభ నియోజక వర్గాల్లో ఓడిపోయినందున వారిని తొలి ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఆయన చేర్చుకోలేకపోయారు. పరాజిత నేతలను మంత్రులుగా నియమించే ఆనవాయితీని నెలకొల్పాలని ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం ఆకాంక్షించలేదు. ఈ సందేశాన్ని లోపాయికారీగా పంపలేదు, కానీ బాహాటంగానే పంపారు. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ కార్యనిర్వాహకుడు, ఆ తరువాత సర్‌సంఘ్‌చాలక్ అయిన కెఎస్ సుదర్శన్ ఆర్థిక శాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హాను తీసుకుని, మరునాటి ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవలసిఉన్న నేతల జాబితాలో నుంచి పరాజితులు ఇద్దరికీ ఉద్వాసన పలకాలనే ఆదేశంతో వాజ్‌పేయి వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో, అహ్మదాబాద్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ కార్యనిర్వాహకులు మోడీ తమ వద్దకు వచ్చి, పరిపాలన, విధానాలపై తమను సంప్రదిస్తారని ఆశించారు.
అయితే, ఆయన రాష్ట్రాన్ని ఏకపక్షంగా నడిపారు, కాలక్రమేణా ఆయన అన్ని విధాన నిర్ణాయక అధికారాలను ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)లో కేంద్రీకృతం చేశారు. ఆయన ప్రధాని అయిన తరువాత అటువంటి పద్ధతినే అనుసరించారు. అయితే, ఆదిలో కేంద్ర మంత్రులను సలహా సంప్రదింపుల సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్ ‘ఆహ్వానించింది’. కాలక్రమేణా, ఆయన ప్రభుత్వాన్ని ‘మోడీ సర్కార్’గా ప్రస్తావించసాగారు. ఆ పదబంధానికి ఆయన జూన్ 4 తరువాత స్వస్తి పలికి, దానిని ‘ఎన్‌డిఎ సర్కార్’గా పేర్కొనసాగారు. వరుసగా మూడవ విడత ఎన్నికల్లో మెజారిటీ సాధించడంలో బిజెపి వైఫల్యంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన పాత్ర పోషించింది. 2014 తరువాత దశాబ్ది కాలంలో అధిక భాగం ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం మోడీ పని సరళి పట్ల అసౌకర్యాన్ని భావించింది, కానీ, దానిని బహిర్గతం చేయలేదు. అందుకు కారణం ఆయన సైద్ధాంతికంగా నిబద్ధుడై, హిందుత్వ అజెండాను కూడా అమలు పరచడమే.
ఎన్నికలు, రాజకీయాలను పూర్తిగా వ్యక్తిగతం చేయడంలో, ‘మోడీ కీ గ్యారంటీ’ నినాదం మరీ శ్రుతి మించి పనిచేసింది. అభ్యర్థి ఎంపికల్లో సూచనలను ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎన్నికల ప్రచార సమయం లో సంఘ్ దూరంగా ఉండేందుకు ప్రధానంగా కారణమైంది. అయినప్పటికీ, ఎన్‌డిఎ బలం 400+ కావాలనే తన లక్షం నెరవేరుతుందని ఆయన అతి నమ్మకంతో ఉండిపోయారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు మరింత ఆగ్రహం తెప్పించిన ఒక పని ఏమిటంటే, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా బహుశా మోడీ, అమిత్ షా ఆమోద ముద్రతో ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేనంతా పార్టీ వృద్ధి చెందిందని, అది ఇప్పుడు ‘సమర్థమైనది’ అని ప్రకటించడం.
జూన్ 4, నవంబర్ 23 తీర్పుల మధ్య పరిస్థితి ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నికల ప్రభావ సామర్థాన్ని ఉద్ఘాటిస్తోంది. మహారాష్ట్రలోను, అందకుముందు హర్యానాలోను బిజెపి, మిత్రపక్షాల సంఖ్యాబలంలో అద్భుత మార్పు విషయంలో మాత్రమే కాకుండా, మోడీ ఉధృతంగా ప్రచారం చేయకుండానే ఆ ఫలితాలు సాధించడాన్ని కూడా అది సూచిస్తోంది. కీలకంగా, మథురలో ఆర్‌ఎస్‌ఎస్ విధాన నిర్ణాయక విభాగం ముఖ్యమైన సమావేశం అనంతరం అక్టోబర్ ద్వితీయార్ధంలో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హొసబలే ఉద్ఘాటనలు మోడీ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధంలో మార్పునకు సూచిక అయింది. మోడీ ఆర్‌ఎస్‌ఎస్ మధ్య సంబంధంలో పరుష దశ స్థాయి సడలిందని ఆయన ప్రకటన సూచించింది, ఆ దశల సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ తీవ్రస్థాయిలో అనేక దూషణలు చేశారు. ఆయన పేరుపెట్టి ఎవరినీ ప్రస్తావించకపోయినా ఎవరిని ఉద్దేశించిందీ తేలికగా గ్రహించుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల అనంతరం నడ్డా కేరళ పాలక్కాడ్‌లో తొలి ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ సమావేశానికి హాజరైనప్పుడు బిజెపికి ఆర్‌ఎస్‌ఎస్ ‘అవసరం’ ఇంకా ఉన్నదనే సంకేతం మొదటిసారి వచ్చింది. నడ్డా ప్రకటనను ఆర్‌ఎస్‌ఎస్ గ్రహించిందని, ‘ఉద్రిక్తతలు లేవు. సంస్థలో ఏదైనా సంభవిస్తే దానిని ఎలా సరిదిద్దాలో మాకు తెలుసు’ అని హొసబలే మీడియాతో చెప్పారు. మోడీ సహాయకుల్లో కచ్చితంగా లేని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ తిరుగులేని మద్దతు అందజేయడం ద్వారా ఆ పరిస్థితిని ‘సరిదిద్దడమైంది’.
లోక్‌సభ తీర్పు అనంతరం, యుపిలో పార్టీ పేలవ ప్రదర్శనకు బాధ్యతను ఆదిత్యనాథ్‌కు ఆపాదించి, ఆయనను మార్చేందుకు మోడీ షా ద్వయం ప్రయత్నించారు. ఆదిత్యనాథ్ ఇన్‌చార్జిగా అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీ అద్భుత ప్రదర్శన మోడీకి అఘాతమే అయింది. అంతేకాకుండా, బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఆదిత్యనాథ్ చేసిన ‘బాతేంగే తో కాటేంగే’ (మనం సమైక్యంగా లేకపోతే బలి అవుతాం) వివాదాస్పద ప్రకటనను ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదించింది. దీనితో మోడీ సహా వివిధ బిజెపి నేతలు ఆ వ్యాఖ్యను ఆధిపత్యవాద నినాదంగా మార్చారు.
అది మహారాష్ట్రలోను, జార్ఖండ్‌లోను బిజెపి ఎన్నికల ప్రచారంలో కీలక నినాదం అయింది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ పోషించిన ప్రధాన పాత్రలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ అంశం కొట్టవచ్చినట్లు కనిపించింది. బిజెపి తదుపరి అధ్యక్షుని ఎంపిక సమయంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ అంశానిది ప్రధాన పాత్రకావచ్చు. ఆర్‌ఎస్‌ఎస్‌ను సంప్రదించకుండా మోడీ, ఆయన సహాయకులు నిర్ణయం తీసుకోవచ్చుననేది సందేహాస్పదమే. 2023 చివరి వరకు, మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నారని, ఒకనాటి అగ్ర సోదర సంస్థ ఆ స్థాయిలో ఇక ఉండదని తరచు చెబుతూ వచ్చారు. నాగ్‌పూర్ కేంద్రంగా గల నేతలు తమ ఆధిపత్య స్థాయిని తిరిగి పొందలేకపోవచ్చు కానీ, రానున్న మాసాల్లో మోడీ ఏకపక్షవాదం గతం గతః కావాలి. వెనుక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌తో సమస్య ‘పరిష్కారం’ అయిన స్థితి నుంచి ఇటీవలి మాసాల్లోని పరిణామాల దృష్టా ఈ ఇబ్బందికర సంబంధాన్ని నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది.
నీలాంజన్ ముఖోపాధ్యాయ్
(ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్)
(డెక్కన్ హెరాల్డ్ సౌజన్యంతో)