సాంస్కృతిక భిన్నత్వానికి ప్రతీక అంటూ ట్విట్
న్యూఢిల్లీ: సంక్రాంతి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక భిన్నత్వమున్న దేశంలోని ఆయా ప్రాంతాల ప్రజలు ఆయా పేర్లతో పండుగలు జరుపుకుంటున్నారని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. తమిళనాడులో పొంగల్ పేరుతో జరుపుకుంటారని గుర్తు చేశారు. ప్రపంచంలోని తమిళ ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మన బంధం పెనవేసుకుపోవాలని, సమాజంలో సోదరభావాన్ని నింపేందుకు ఈ పండుగ స్ఫూర్తిగా నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు. అసోంలో మాఘ్ బిహు పేరుతో ఈ పండుగ జరుపుకుంటారని గుర్తు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్నిచోట్ల భోగి పేరుతో జరుపుకుంటారని తెలిపారు. దేశ ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తున్నానన్నారు. పంటలు చేతికొచ్చినవేళ, ఉత్తరాయణం ప్రారంభానికి సూచికగా మకర సంక్రాంతిని జరుపుకోవడం తెలిసిందే.