వాషింగ్టన్ : టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని, తాను మోడీతో వెల్లడించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య ఇటీవల జరిగిన మీటింగ్‌లో టారిఫ్‌ల గురించి ఆసక్తికర చర్చ నడిచింది. ఈ విషయాన్ని స్వయంగా , ట్రంప్ బుధవారం వెల్లడించారు. బిలియనీర్ మిత్రుడు ఎలాన్ మస్క్‌తో కలిసి ఆయన బుధవారం విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ “ మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం. పరస్పరం పన్నులు విధించుకోబోతున్నామని నేను ఇటీవల ప్రధానికి (మోడీకి ) చెప్పాను. మీరెంత ఛార్జి చేస్తే నేనూ అంతే విధిస్తా.
ఇంతలో ఆయన (మోడీ) ఏదో చెప్పబోయారు. వద్దు..వద్దు.. నేను దానిని ఇష్టపడను. మీరు ఎంత ఛార్జి చేస్తే, నేను అంతే విధిస్తాను ” అని స్పష్టంగా చెప్పాను. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వాటిపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై దాదాపు 100 శాతం సుంకాలను విధిస్తుంది. తాజాగా సమావేశంలో ట్రంప్ పక్కనే కూర్చున్న మస్క్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. “ అవును . ఆటో దిగుమతులపై 100 శాతం పన్ను విధిస్తుంది ” అని ట్రంప్ వ్యాఖ్యలను సమర్ధించారు.
దీనికి మరోసారి ట్రంప్ స్పందిస్తూ … “ అవి చాలా చిన్నవి. వాటిని మించిన సుంకాలు విధిస్తుంది. ఇతరులు కూడా అంతే. నేను 25 శాతం పన్నులు విధిస్తే , అబ్బో అంత భయంకరంగానా అని అంటారు. అందుకే నేను ఆ మాట ఇక అనను. వారెంత విధిస్తే , మనమూ అంతే ఛార్జి చేస్తాం. నాతో ఎవరూ వాదించలేరు. అప్పుడే వారు సుంకాలు నిలిపేస్తారు ” అని వివరించారు. పన్ను విషయంలో భారత్‌ను ట్రంప్ తప్పు పట్టడం ఇదే తొలిసారి కాదు. తన తొలివిడత పాలన సమయంలో కూడా ఇండియన్ టారిఫ్ కింగ్ అని వ్యాఖ్యానించేవారు. ఈ సందర్భంగా భారత్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా డబ్బులు ఇవ్వడంపై కూడా ట్రంప్ స్పందించారు.
న్యూఢిల్లీ వద్ద చాలా సొమ్ము ఉందన్నారు. ప్రపంచం లోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటిగా అభివర్ణించారు. తనకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉందన్నారు. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా ? మరి మనదేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉందని ట్రంప్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత్ అమెరికా వాణిజ్యాన్ని 2030 నాటికి 500 మిలియన్ డాలర్లకు చేర్చాలని లక్షంగా పెట్టుకున్నారు. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుక సన్నాహాలు మొదలు పెట్టారు.