ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఆగస్టు 14ను విభజన గాయాల స్మారక దినంగా పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈ ట్విట్ చేశారు. 1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోవడానికి ముందు జరిగిన ఆనాటి విషాద ఘటనలను గుర్తు చేస్తూ ప్రధాని ఈ ట్విట్ చేశారు. విభజననాటి బాధల్ని ఎప్పటికీ మరిచిపోలేం. లక్షలాదిమంది మన సోదరీమణులు, సోదరులు తమ సొంత ప్రాంతాల నుంచి తరలించబడ్డారు. బుద్ధిహీనమైన విద్వేషం, హింస వల్ల ఎందరో ప్రాణాలు విడిచారు. మన ప్రజల పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఆగస్టు 14ను విభజన గాయాల స్మారక దినంగా పాటిద్దామని ప్రధాని ట్విట్ చేశారు. ‘సామాజిక విభజనలకు కారణమయ్యే విషాన్ని తొలగించుకునేందుకు ఆనాటి విషాదాల్ని గుర్తు చేసుకుందాం. సామాజిక సామరస్యత, మానవ సాధికారత, ఏకత్వ స్ఫూర్తిని బలోపేతం చేసుకుందాం’ అంటూ ప్రధాని మరో ట్విట్ చేశారు.