Monday, January 20, 2025

ఓటు బ్యాంకు రాజకీయాలకు బిజెపి దూరం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

భోపాల్: బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల మార్గాన్ని బిజెపి అనుసరించబోదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం భోపాల్‌ను సందర్శించిన ఆయన బిజెపి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కొందరు అనుసరించిన బుజ్జగింపు రాజకీయాలు దేశాన్ని భ్రష్టం పట్టించాయని అన్నారు. ఉమ్మడి పౌర స్మృతిని సుప్రీంకోర్టు కూడా సూచించిందని, అయితే ఓటుబ్యాంకు రాజకీయాలను ఆచరించేవారు దీన్ని వ్యతిరేకిస్తున్నారని మోడీ విమర్శించారు.

దేశ ప్రజలందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలని భారత రాజ్యాంగం కూడా నిర్దేశిస్తోందని ఆయన అన్నారు. బిజెపి తుష్టీకరణ్ విధానాన్ని(బుజ్జగింపు) మార్గాన్ని కాకుండా సంతుష్టీకరణ్(సంతృప్తి) మార్గంలో నడుస్తుందని ఆయన అన్నారు. బుజ్జగింపు మార్గాన్ని, ఓటు బ్యాంకు రాజకీయ మార్గాన్ని బిజెపి ఎన్నటికీ అనుసరించబోదని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వెనుకబడిన వర్గమైన పస్మంద ముస్లింలను కూడా సమానంగా చూడరని ఆయన చెప్పారు.

బుజ్జగింపు విధానాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, దక్షిణ భారతదేశంలోని కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరెన్నో రాష్ట్రాలలో చాలా కులాలు వెనుకబడి ఉన్నాయని ప్రధాని అన్నారు. ఏ రాజకీయ పార్టీలు తమను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయో ముస్లింలు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి పేరిట కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. సభలో ఒక్కో సభ్యుడికి ఒక్కో చట్టం ఉంటే సభ ఎలా నడుస్తుందని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా రెండు రకాల పౌర స్మతులు ఉంటే దేశం ఎలా ముందుకు వెళుతుందని ఆయన నిలదీశారు.
మీ కుమారులు, కుమార్తెలు, మనవల సంక్షేమాన్ని మీరు కోరుకుంటే బిజెపికే ఓటు వేయాలని, కుటుంబ పార్టీలకు కాదని ప్రధాని పిలుపు ఇచ్చారు.

వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత తిరిగి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 2024లో బిజెపినే తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రజలందరి నోట భరోసా అన్న పదమే వాడుకలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన ప్రస్తావిస్తూ అటువంటి వారి పట్ల కోపం కాకుండా జాలి పడాలని ఆయన వ్యాఖ్యానించారు.

ట్రిపుల్ తలాఖ్‌ను సమర్థిస్తున్న వారంతా ముస్లిం మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నట్లేనని ఆయన చెప్పారు. 80-90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాఖ్ ఈజిప్టులో నిషేధానికి గురైందని, అది అవసరమైతే పాకిస్తాన్, ఖతార్, ఇతర ముస్లిం ప్రాబల్య దేశాలలో ఎందుకు నిషేధించారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో బిజెపిని మరింత బలోపేతం చేసి తిరిగి అధికారింలోకి తీసుకురావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News