Friday, November 22, 2024

బీహార్ కుగ్రామంలో మోడీ, షా, సోనియాకు టీకాలు!

- Advertisement -
- Advertisement -
Modi, Shah, Priyanka Chopra 'vaccinated' in Bihar
ప్రహసనంగా మారిన వ్యాక్సినేషన్ ప్రక్రియ

పాట్నా: ప్రపంచంలో ఎక్కడ లేని వింతలన్నీ బీహార్‌లోనే జరుగుతుంటాయనడానికి మరో తాజా ఉదాహరణ ఇది. 1990 దశకంలో పశుదాణా కుంభకోణం వెలుగుచూసినపుడు స్కూటర్ల మీద పశువులను రవాణా చేసినట్లు రికార్డుల్లో చూపించిన ఘనత బీహార్ ప్రభుత్వ అధికారులకే దక్కింది. తాజాగా, నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్ పేర్లతో బీహార్‌లోని ఒక మారుమూల గ్రామంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు బయటపడింది. అర్వాల్ జిల్లాలోని కర్పి పంచాయత్‌లో ఈ ప్రముఖుల పేర్లతో గ్రామస్తులు ఉన్నట్లు&వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వ్యాక్సిన్ కూడా వేసుకున్నట్లు రికార్డుల్లో నమోదైంది.

20 రోజుల క్రితం సివిల్ సర్జన్ రికార్డులను తనిఖీ చేస్తుండగా ఈ ఉదంతం బయటపడిందని, వెంటనే ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఉద్యోగం నుంచి తొలగించి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అర్వాల్ జిల్లా మెజిస్ట్రేట్ జె ప్రియదర్శిని తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా రికార్డులను తనిఖీ చేయవలసిందిగా ఆదేశాలు జారీచేశామని, ఇటువంటి అవకతవకలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఇదిలాఉండగా..తాజా సంఘటన రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలకు పదునుపెట్టింది. మోడీ, షా, సోనియా గాంధీ, ప్రియాంక చోప్రాలకు మూడు సార్లు వ్యాక్సిన్ వేసినట్లు ఉన్న జాబితాను ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ స్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News