హన్మకొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసన సభా పక్ష నాయకులు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్శిటీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమతో పాటు ఏదేని సాగునీటి ప్రాజెక్టు కు జాతీయ హోదా అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగన్ ఓవర్ హాలింగ్, వ్యాగన్‌ల తయారీ యూనిట్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో కోచ్ ఫ్యాక్టరీలను గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలించుకుపోయిన నరేంద్ర మోడీ వెనుకబడిన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలోని ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని, తెలంగాణ ఉద్దరిస్తామని చెబుతున్న బిజెపి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
విభజన హామీల అమలు కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 12 రోజుల పాటు ప్రజా పోరు యాత్ర నిర్వహించి హనుమకొండలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగిందని అన్నారు. తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా వరంగల్ నగరంలో అడుగు పెట్టే అర్హత మోడీకి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతున్నదో బిజెపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేవలం ఎన్నికల స్టంట్ కోసం కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి మతోన్మాద చర్యలతో పాటు, కార్మిక హక్కులను కాలరాస్తున్నదని, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నదని విమర్శిస్తపన్నదని అన్నారు. దీంతో బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఐ లౌకిక ప్రజాతంత్ర విశాల ఐక్యవేదిక విర్మిస్తున్నదని, బిజెపిని గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు.
రాష్ట్రంలోనూ బిజెపిని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, నాయకులు ఉట్కూరి రాములు, మంచాల రమాదేవి, బాషబోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.