వెంకయ్య నాయుడు సూచన
న్యూఢిల్లీ: తాను అనుసరించే విధానాల కారణంగా ఏర్పడిన అపోహలను తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ తరచు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కలుస్తుండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలతో కూడిన సంకలనం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ పుస్తకాన్ని వెంకయ్య నాయుడు శుక్రవారం నాడిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆరోగ్యరక్షణ, విదేశాంగ విధానం, టెక్నాలజీ తదితర అనేక రంగాలలో ప్రధాని మోడీ సాధించిన విజయాలను ప్రశంసించారు. భారతదేశ విజయాలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోందని ఆయన అన్నారు.
భారతదేశం ఇప్పుడు బలమైన శక్తిగా ఆవిర్భవిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా భారత్ గొంతుక వినపడుతోందని ఆయన అన్నారు. అతి తక్కువ కాలంలో ఇది సాధించడం అసాధారణమని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ కార్యాచరణ, ఆయన ప్రజలకు అందచేస్తున్న మార్గదర్శనంతోనే భారత్‌లో ఈ అభివృద్ధి సాధ్యమైందని వెంకయ్య అన్నారు. ప్రధాని మోడీ ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఆయన అనుసరిస్తున్న విధానాల కారణంగానే కొన్ని రాజకీయ పక్షాలలో అపోహలు ఏర్పడుతున్నాయని, వీటిని నివృత్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో ఆయన తరచు చర్చలు జరపడం అవసరమని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, అదే శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పాల్గొన్నారు.