Sunday, December 22, 2024

చేనేతకు చేయూతివ్వండి

- Advertisement -
- Advertisement -

Modi should stop discriminating against Telangana:KTR

కేంద్రం, రాష్ట్రం ఫిఫ్టీ ఫిఫ్టీ భరిద్దాం

చేనేత, మరమగ్గాల ఆధునీకరణకు లూమ్ అప్‌గ్రేడెషన్ పథకం కింద నిధులివ్వాలి
కొత్తగా 11 క్లస్టర్‌లను గుర్తించి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
తెలంగాణపై ప్రధాని మోడీ వివక్ష వీడాలి
బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్‌లలో రాష్ట్రానికి ఇప్పటివరకు ఒరిగిందేమీలేదు
నేతన్నలను నిర్లక్షం చేస్తే ఇకపై సహించం
అవసరమైతే వారితో కలిసి పోరాటం
బండీ.. నీ పలుకుబడి ఉపయోగించి వరంగల్‌కు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయించు
సిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గానికి చొప్పున వంద కుటుంబాలకు త్వరలో దళితబంధు
‘మన ఊరు మన బడి’లో భాగంగా మూడు దశల్లో 26వేల స్కూళ్లల్లో అభివృద్ధి పనులు
సిరిసిల్లలో మీడియాతో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల : తెలంగాణ పట్ల ప్రధాన మంత్రి మోడీవివక్ష వీడనాడి రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, చేనేత, టెక్స్‌టైల్ శాఖ మంత్రి కె తారక రామారావు కోరారు. శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోడీ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్, టీమ్ ఇండియా వంటి అనేక నినాదాలు ఇస్తున్నారని వాస్తవంలో అందుకు అనుగుణంగా వ్యవహరించడంలేదని మంత్రి కెటిఆర్ విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేంద్రం ఇప్పటికే ఏడు సార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో నిధులు కేటాయింపు కోసం పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. “అయిననూ పోయిరావలె హస్తినకు..” అని పెద్దలు చెప్పినట్లుగా.. వచ్చే నెల ఒకటో తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో మన రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తున్నానన్నారు.

మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు లూమ్ అప్‌గ్రేడేషన్ పథకం కింద నిధులు ఇవ్వాలని.. ఇందులో కేంద్ర ప్రభుత్వం 50శాతం భరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో 50శాతం భరిస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 11 చేనేత సమూహలు గుర్తించి వాటి అభివృద్ధికి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద నేషనల్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ఇందుకోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఏడేళ్లుగా కోరుతున్నా నిర్లక్షం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నేతన్నలను ఇలాగే నిర్లక్షం చేస్తే ఇకపై సహించమని రాష్ట్ర స్థాయిలో నేతన్నల సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నేతన్నలపై చూపుతున్న వివక్ష, సవతి తల్లిప్రేమను బైటపెడతామన్నారు. అవసరమైతే నేతన్నలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.

బండీ.. వరంగల్‌కు మెగా పవర్‌లూం క్లస్టర్ మంజూరు చేయించు..

రాజకీయాలు పక్కనపెట్టి వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను మంజూరు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ను మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నారు. దేశంలో వ్యవసాయం తరువాత అత్యధికంగా నేత వృత్తి ద్వారానే అనేక మంది ఉపాధి పొందుతున్నారని. వరంగల్‌లో 1,250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి పిఎం మిత్ర పథకం కింద చేనేత రంగం అభివృద్ధికి రూ.897.92 కోట్లు కేటాయించాలన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యెండ్లూమ్ టెక్నాలజి సంస్థ విభజనలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరికి తరలిపోయినందున హ్యెండ్లూమ్ సంస్థను తెలంగాణలోని పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు.

సిరిసిల్ల జిల్లాలో కరోనా మూడో దశ తీవ్రత అంతగా లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. తగిన మందులు, సదుపాయాలు జిల్లాలో ఉన్నాయన్నారు. ఆసుపత్రులలో అదనపు సిబ్బందిని నియమించుకోవడానికి కలెక్టర్లకు అనుమతి ఇచ్చామన్నారు. వ్యాక్సినేషన్‌లో జిల్లా టాప్ 5లో ఉందన్నారు. తొలి డోస్ అందరికి ఇచ్చారని, రెండో డోసు 86 శాతం పూర్తయిందని, మిగిలిన 14 శాతం కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించామన్నారు. జిల్లాలో ఫీవర్ సర్వే కోసం 479 బృందాలు నియమించారని వారం రోజుల్లో జిల్లాలోని 1,55,000 ఇండ్లు తిరిగి సర్వే పూర్తి చేస్తారన్నారు. ఫిబ్రవరి నెలలో పైలెట్ ప్రాజెక్టు కింద సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఏక కాలంలో హెల్త్ ప్రొఫైల్ సర్వే చేస్తారన్నారు. సిరిసిల్ల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే అభిప్రాయం కాస్తా సిఎం కెసిఆర్ ప్రభుత్వ పనితీరు వల్ల నేను సర్కార్ దవాఖానకే పోతా.. అనే విశ్వాసం సిఎం కెసిఆర్ ప్రభుత్వ తీరుతో ప్రజలకు కలిగిందన్నారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చిలోగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున దళితులను ఎంపిక చేసి దళితబంధు నిధులు వారి ఖాతాల్లో వేస్తామన్నారు. మన ఊరు మన బడి పథకం కింద మూడు దశల్లో రాష్ట్రంలోని 26వేల స్కూళ్లలో అభివృద్ధి పనులు, నాణ్యమైన విద్య అందేలా చూస్తున్నామన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 510 స్కూళ్లు అభివృద్ధి చెందుతాయన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ ఎన్ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News