Wednesday, January 22, 2025

చర్చించదగ్గ మోడీ మాటలు

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో రెండు మాటలు పదేపదే అంటున్నారు. కొన్ని పార్టీలు కులం పేరిట ప్రచారం చేస్తూ సమాజాన్ని విడదీస్తున్నాయనేది వాటిలో ఒకటి. మరి కొన్ని పార్టీలు ప్రాంతాల పేరు చెప్పి దేశాన్ని విభజించజూస్తున్నాయనేది రెండు. ఇవి రెండూ కూడా ఆయా పార్టీలపై తీవ్రమైన ఆరోపణలు. కనుక, అందులోని వాస్తవాలేమిటి? అసలు ఇందుకు సంబంధించిన విషయాలేమిటన్నది జాగ్రత్తగా చర్చించుకోవలసిన ప్రశ్నలు. కావాలంటే ఆయన విమర్శలను, తాను మతం పేరిట సమాజాన్ని విభజిస్తూ దేశ విభజన ప్రమాదాన్ని సైతం సృష్టిస్తున్నారని ఒక్క మాటలో కొట్టివేయవచ్చు.కాని అందువల్ల వాస్తవ పరిస్థితులేమిటో అర్ధం కావు. ముందుగా కులం విషయం చూద్దాము.

మన దేశంలోని కుల వ్యవస్థ గురించి అందురికీ తెలిసిందే గనుక కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. కులాలకు రెండు కోణాలున్నాయి. ఒకటి, కొందరు ఈ వ్యవస్థను సృష్టించి కావాలనే కొన్ని కులాలను అణచివేయటం. రెండు, ఆయా వృత్తి కులాలకు అవి ఒక సామాజిక గుర్తింపుగా ఉండటం. తమ వృత్తుల బాగోగుల కోసం ప్రయత్నించటం అట్లా ప్రయత్నించటంలో భాగంగా సంఘటితం కావటం, సమాజంలోని ఇతర వర్గాలతో, ముఖ్యంగా పాలకులతో లాబీయింగ్ చేయటం, తమ వృత్తులకు, వృత్తి పనుల వారికి ఏదైనా హాని కలిగే పరిస్థితులు ఏర్పడితే వాటిని కలిసికట్టుగా ప్రతిఘటించటం. ఇదంతా సూత్రప్రాయంగా మొదట కుల వ్యవస్థ అన్నది ఏర్పడినప్పటి నుంచే జరుగుతూ వస్తున్నది.

దీనిని గుర్తించే స్వాతంత్య్రానంతరం కూడా కులాలు, కుల సంఘాలు, నాయకులకు అన్ని పార్టీలు తగు గుర్తింపులు, ప్రాతినిధ్యాలు ఇవ్వసాగాయి. నిజానికి రెండవ వైపున చూస్తే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, పరిపాలనాపరంగా ఆధిపత్యాలను నెరుపుతుండిన వారిలోనూ అత్యధికులు కొన్ని కులాలు గుర్తింపు ఉన్నవారే. ఇది పూర్వరంగం లేదా నేపథ్య స్థితి. స్వాతంత్య్రానంతర కాలానికి వస్తే ఏం జరిగింది? మన రాజ్యాంగం, చట్టాలు, వివిధ ప్రణాళికలు, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఆయా ఆర్థిక రంగాలకు వలెనే, తమ పద్ధతిలో తాము కూడా ఆర్థిక రంగాలే అయిన వృత్తి కులాల బాగు కోసం అనేక హామీలనిచ్చాయి. నిజానికి ఆ వృత్తి కులాలు, ఆ కులాల ప్రజలు బాగుపడటమన్నది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసేదే. కనుక వృత్తి కులాలు బాగు పడటం ఆ కులాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తప్పనిసరి. కాని దురదృష్టవశాత్తు కాలం గడిచే కొద్దీ ఇవన్నీ చాలా వరకు కాగితాలకు పరిమితమవటం మొదలైంది.

వివిధ వృత్తి కులాల పురోగతి కుంటుపడసాగింది. అధికారంలో గల వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ విధంగానైతే రాజ్యాంగాన్ని, చట్టాలను, ప్రణాళికలను, మేనిఫెస్టోలను ఉపేక్షిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని నిర్లక్షం చేయసాగారో, వృత్తి కులాల స్థితిగతుల మార్పిడిని కూడా అదే విధంగా విస్మరించటం మొదలుపెట్టారు. ఈ వైఖరి వృత్తి కులాల పట్లనే కాదు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతుల విషయంలోనూ కనిపిస్తూ వచ్చింది. అది వారందరిలో నిరసన భావాలకు దారితీసింది. వారి నిరసనలు వేర్వేరు రూపాలు తీసుకున్నాయి.

నిరసన ప్రకటనలు, విజ్ఞాపన పత్రాలు, ప్రదర్శనలు, ఉద్యమాలు, ఆ కాలంలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌కు దూరం కావటం, తమ గురించి పైపై మాటలు తప్ప చిత్తశుద్ధి చూపటం లేదంటూ కమ్యూనిస్టులపై కూడా వ్యతిరేకత చూపటం, కొందరు నక్సలైట్ల వంటి తీవ్రవాద సంస్థలు వైపు మొగ్గటం వంటి పరిణామాలు అనేకం చోటు చేసుకోసాగాయి. ఇక్కడ గ్రహించవలసిందేమంటే, కుల పార్టీల ఆవిర్భావానికి మూలాలు కూడా సరిగా ఈ పరిస్థితులలోనే ఉన్నాయి. పైన చెప్పిన పరిణామాలు ఒకవైపు, కుల పార్టీలు, వృత్తి కుల పార్టీలు, గిరిజనుల పార్టీల ఏర్పాటు వంటి పరిణామాలు ఈ పరిస్థితులలోనే ఒక దాని కొకటి సమాంతరంగా సాగాయి. ఇది ఈ సువిశాల దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో కాకుండా అంతటా జరిగింది. వాటికి నచ్చజెప్పేందుకు లేదా మభ్యపెట్టేందుకు పెద్ద వారి పార్టీలు తమ ప్రయత్నాలు తాము చేశాయి.

అందులో కొంత సఫలం అయి ఉండవచ్చు కూడా. అట్లాగే, ఈ వృత్తి కులాలు, గిరిజన జాతుల పార్టీలు ఏదో ఒక మేర సఫలం కావచ్చు లేదా విఫలమై ఉండవచ్చు. కాని విషయం అదికాదు. వారి వైపు నుంచి ఇటువంటి రెండు విధాలైన పరిణామాలు జరిగాయన్నదే ప్రధానం. అటువంటపుడు ఈ సుదీర్ఘ పరిణామ క్రమాన్నంతా విస్మరించి ప్రధాన మంత్రి మోడీ ‘కుల పార్టీ’లంటూ నిందించటం సరైనదవుతుందా? ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉంది. స్వయంగా నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయ రంగంలోకి మొదటిసారిగా వచ్చినప్పుడు, తాను బిసినని, తనది తేలీ కులమని ప్రకటించుకున్నారు. అది కూడా కుల రాజకీయాలు ముమ్మరంగా సాగే బీహార్‌లో ఆయన ప్రాతినిధ్యం వహించే బిజెపి కుల పార్టీ కాదు. అందుకు భిన్నంగా మత పార్టీ అని పేరు పడినటువంటిది. కొందరైతే ఈ దేశంలో కుల వ్యవస్థను సృష్టించి నిమ్నకులాలను అణచివేసే సంప్రదాయానికి వారసత్వం ఆ పార్టీదని విమర్శిస్తారు.

మోడీ కన్న ముందు ఏ ప్రధాన మంత్రి అభ్యర్థి కూడా తన కులాన్ని ప్రస్తావించటం, ఆ పేరిట సానుభూతి పొందజూడటం జరగలేదు. తన కుల ప్రస్తావనలు ఆయన 2014తో ఆరంభించి పదేళ్లు గడిచినాక నేటికీ చేస్తున్నారు. ఒక విధంగా ఇందులో ఆక్షేపించ వలసిందేమీ లేదు. అట్లా చేయటంలో తన పరమోద్దేశం తమ వంటి కులాలు ఈ సామాజిక వ్యవస్థలో నిర్లక్షానికి, వెనుకబాటుకు గురియ్యాయని చెప్పటం. అట్లా చెప్పటం మెచ్చదగినదే. అయితే, అటువంటి వ్యవస్థను సృష్టించిన సాంస్కృతిక సంప్రదాయం, వారసత్వం గల పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నది ఒక ఆక్షేపణ. వృత్తి కుల పార్టీలను అవి సమాజాన్ని విభజిస్తున్నాయంటూ నిందించటం అంతకు మించిన ఆక్షేపణ. మరి ఆచరణలో చూసినపుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా గాని, ప్రధాన మంత్రిగా గాని వృత్తి కులాల కోసం, ఇతర అణగారిన కులాల కోసం, గిరిజన జాతుల కోసం చేసిందేమిటన్నది అంతిమ ప్రశ్న. నిర్దిష్టంగా ఈ అంశంపై ఆయన ఒక నివేదికను ప్రకటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

అట్లాగే, తమ పార్టీ రాజకీయ విజయం కోసం కుల పార్టీలతో, గిరిజన పార్టీలతో పొత్తుల కోసం ఎంత మాత్రం ప్రయత్నించక తన శుద్ధతను నిలబెట్టుకుంటే కూడా బాగుంటుంది. నరేంద్ర మోడీ రెండవ విమర్శ ప్రాంతీయ పార్టీల గురించి. ఇది కూడా ఒక విధంగా వృత్తి కులాల చరిత్ర వంటిదే. భారత దేశ వైవిధ్యత, మొదటి నుంచి వందలాది తెగలు, రాజ్యాలు, స్వాతంత్య్ర సమయంలో రాజ్యాంగం చెప్పిన ఫెడరలిజం స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత ప్రాంతీయ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ప్రయోజనాల కోసం, వాటిని అణచివేయజూసే కేంద్రీకరణ శక్తులకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల ఏర్పాటు, వాటికి లభిస్తున్న ప్రజాదరణ మొదలుగా గల చరిత్ర అంతా అనేక విధాలుగా అధ్యయనాలు జరిగినదే. ఫెడరలిజం గాని, ప్రాంతీయ పార్టీలు గాని దేశ ఐక్యతను మరింత పటిష్టం చేసేవే తప్ప విభజనకు దారి తీసేవి కాదని పండితులు అందరూ చెప్తున్న మాటే.

అదంతా ఇక్కడ వివరంగా రాయవలసిన అవసరం లేనేలేదు. ఇదంతా మోడీకి తెలియనదని ఎంత మాత్రం అనుకోలేము. అయినప్పటికీ ఆయన ప్రాంతీయ భావనలు, పార్టీలు దేశ విభజనకు దారి తీస్తాయనటం రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప, అందులో ఒక తర్కం గాని, సహేతుకత గాని లేవు. ఆయన తన మాటను నమ్ముతున్నట్లయితే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవద్దు గదా. బిజెపి గతంలో ఆపని చేసింది, ఇప్పటికీ చేస్తున్నది. అటువంటిపుడు ఆయన ఆరోపణకు విలువేమిటి? విషయమేమంటే, ఆర్‌ఎస్‌ఎస్‌కు, బిజెపికి, మోడీకి దేశంలోని అన్ని విధాలైన వైవిధ్యతను అంతం చూసి కేంద్రీకరణ జరపాలన్నది అంతిమ లక్షం. అందుకోసమే ఒక స్థాయిలో వృత్తి కులాలు, ఇతర కులాలు, తెగల పార్టీలను మరొక స్థాయిలో ప్రాంతీయ పార్టీల రూపంలో గల ఫెడరలిజాన్ని అంతం చేయజూస్తున్నారు. మోడీ మాటలన్నింటిలోని ఉద్దేశం అదే. కాకపోతే ఆ మాట బయటకు అనరు. సహజంగానే.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News