లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తాం
‘జల్ జీవన్ మిషన్’కు ఇండియా కూటమి అడ్డంకులు
ఆవాస్ యోజనదీ అదే పరిస్థితి
ధన్‌బాద్‌లో ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం
బర్వాడ (ఝార్ఖండ్): ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఝార్ఖండ్ ఢన్‌బాద్‌లో ఎన్నికల శంఖం పూరించారు. దేశం మోడీ గ్యారంటీపై ఆధారపడినందున రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ 400 సీట్లు గెలుపొందుతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ‘జల్ జీవన్ మిషన్’, ‘ఆవాస్ యోజన’ పథకాల అమలుకు అడ్డంకులు సృష్టిస్తున్నదని కూడా ప్రధాని ఆరోపించారు.
బర్వాడలో ‘విజయ్ సంకల్ప్ ర్యాలీ’లో మోడీ ప్రసంగిస్తూ, ‘దేశానికి మోడీ గ్యారంటీపై విశ్వాసం ఉన్నందున రానున్న లోక్‌సభ ఎన్నికలలో అబ్‌కీ బార్ 400 పర్ (ఈదఫా మేము 400 పైచిలుకు సీట్లు గెలుపొందుతాం). ఇతరుల నుంచి ఆశలు అన్నీ ముగిసే చోట మోడీ గ్యారంటీ మొదలవుతుంది’ అని చెప్పారు. ‘సింద్రీ ఎరువుల కర్మాగారం, ఉత్తర కరణ్‌పురా విద్యుత్ ప్రాజెక్ట్ వంటి ప్లాంట్‌ల పునఃప్రారంభం మోడీ గ్యారంటీ వల్ల నెరవేరిందనడానికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో జెఎంఎం నేతృత్వంలోని కూటమిపై మోడీ తీవ్రంగా విరుచుకుపడుతూ, అది రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు.
‘ఝార్ఖండ్ నుంచి స్వాధీనం చేసుకున్న నోట్ల భారీ కట్టలు వంటివి నేను చూడలేదు. ప్రజల వద్ద నుంచి దోచుకున్న డబ్బు ఎంత అయినా వారికి వాపసు చేయవలసిందే. అది మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. ‘రాష్ట్రంలో జెఎంఎం నాయకత్వంలోని ప్రభుత్వ హయాంలో దోపిడీ పరాకాష్ఠకు చేరుకుంది. బుజ్జగింపు విధానం చొరబాటుకు దారి తీసింది’ అని మోడీ ఆరోపించారు. ఆయన ఇండియా కూటమిని కూడా దుయ్యబట్టారు. ప్రతిపక్ష కూటమి ‘అభివృద్ధి నిరోధకం, ప్రజల వ్యతిరేకం’ అని ప్రధాని అన్నారు.