సమర్కండ్: భారత దేశాన్ని ప్రపంచంలోనే ‘తయారీ హబ్’ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, ఆ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపేర్కొన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆహార, ఇంధన సంక్షోభాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఉజ్బెకిస్థాన్ లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్ సివో) సదస్సులో మోడీ ప్రసంగించారు. ఆహార, ఇంధన సరఫరాలో ఆటంకాలను తొలగించి, మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సభ్య దేశాలకు మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలవడం సంతోషకరమన్నారు. వచ్చే ఏడాది ఎస్‌సివో సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడానికి చైనా పూర్తి మద్దతు ప్రకటించింది.