Thursday, January 23, 2025

మోడీ మౌనవ్రతాన్ని భగ్నం చేశాం

- Advertisement -
- Advertisement -

మణిపూర్, హర్యానాల్లో హింసను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీవేడి చర్చ ప్రారంభం

న్యూఢిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాలు మణిపూర్, హ ర్యానాలలో హింసను కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమయిందని పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శించారు. మంగళవారం లోక్‌సభ లో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ప్రధాని మోడీ పార్లమెంటులో మాట్లాడరాదనే మౌన వ్రతాన్ని చేపట్టారని… ఆ వ్రతా న్ని భగ్నం చేసేందుకే అవిశ్వాస తీర్మానాన్ని ప్ర తిపాదించామని ప్రతిపక్ష ఇండియా కూటమి పే ర్కొంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. కేంద్రంపై సునిశిత విమర్శలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందని తెలిపారు. మణిపూర్ తగులబడుతోందంటే భారత్ తగులబడినట్లేనని గొగోయ్ అన్నారు.

మణిపుర్ సీఎం బీరేన్ సింగ్‌ను పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రెండువర్గాల మధ్య ఘర్షణలు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని అసలు విషయాలపై మాట్లాడకుండా ఇండియా కూటమిపై విమర్శలు చేస్తున్నారని గౌరవ్ గొగోయ్ ఆక్షేపించారు. ప్రజా సమస్యలపై మోదీ మౌనం కొత్తేమీ కాదన్నారు. సాగుచట్టాలపై రైతులు ఆందోళన చేసినపుడు మౌనంగానే ఉన్నారని, అదానీపై విమర్శలు వచ్చినపుడు మౌనంగానే ఉన్నారని ఆక్షేపించారు. చైనా బలగాలు భారత్ లోకి వచ్చినపుడు, పుల్వామా ఘటన సమయంలో కూడా మోదీ మౌనంగానే ఉన్నారని గుర్తు చేశారు.

మరో కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు మనీశ్ తివారీ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి, మత సామరస్యం, వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడడంసహా అనేక రంగాల్లో ఘోరంగా విఫలమయిందని దుయ్యబట్టారు. ఇది దురదృష్టకరమన్నారు.గత మూడు నెలలుగా మణిపూర్ గత మూడు నెలలుగా మండుతూనే ఉందని, అక్కడ శాంతిని పునరుద్ధరించడానికి కేంద్రం ఏమీ చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. మణిపూర్ వ్యూహాత్మకంగా కీలక మైన రాష్ట్రమని ఆయన అంటూ, ఈశాన్య భారతంలోఎక్కడ అలజడి చెలరేగినా దాని ప్రభావం దేశ భద్రతపై పడుతుందని తివారీ అన్నారు.

మణిపూర్ సిఎం తక్షణం రాజీనామా చేయాలి : సూలే

అనంతరం చర్చలో పాల్గొన్న ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే కేంద్ర, మణిపూర్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇంతటి విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్ ప్రభుత్వం సిగ్గుచేటైన తప్పిదాలు చేసిందని మండిపడ్డారు. మణిపూర్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని సుప్రియా సూలే డిమాండ్ చేశారు. మణిపూర్‌లో 179 మంది ప్రజలు మరణించారని, 60 వేల మంది నిరాశ్రయులయ్యారని, 350 సహాయ శిబిరాల్లో ఇప్పటికీ 40 వేల మంది ఉన్నారని సూలే సభకు తెలిపారు. 3,662 ఇళ్లను, 321 ప్రార్థనా మందిరాలను తగులబెట్టారని, అల్లర్లు, హత్యలు, అత్యాచారం కేసులు 10 వేలకుపైగా నమోదయ్యాయని ఇవన్నీ పట్టించుకోకుండా ఎలా ఉంటామని నిలదీశారు. మణిపుర్‌లో అక్కడి ప్రభుత్వమే పెద్ద సమస్యని విమర్శించారు.

కేంద్రం విఫలమైనందునే సుప్రీం జోక్యం : ఆరిఫ్

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ అతి తక్కువ సార్లు సభకు హాజరు కావడం ద్వారా రికార్డు సృష్టించారని సిసిఎం సభ్యుడు ఎఎం ఆరిఫ్ విమర్శించారు. ఓ వైపు మణిపూర్ మండిపోతుంటే ప్రధాని ఫ్రాన్స్‌కు వెళ్లి ప్రపంచ శాంతిపై ఉపన్యాసమిచ్చారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమయినందునే సుప్రీంకోర్టు మణిపూర్‌లో బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించాల్సి వచ్చివదన్నారు. మణిపూర్ తర్వాత ఇప్పుడు హర్యానా కూడా మండుతోందని, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయని, వాటి డబుల్ ఇంజిన్ సర్కార్‌లు విచ్ఛిన్న రాజకీయాల అజెండాను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) మరో విచ్ఛిన్న అజెండా అని దుయ్యబట్టారు.

మణిపూర్‌లో పరిస్థితి ఎంపిలను కలచివేసింది : టిఆర్ బాలు

బాధ్యత గల ఇండియా కూటమి ఎంపీలు మణిపూర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను చూసి ఆవేదన చెందారని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా డిఎంకె ఎంపి టిఆర్ బాలు తెలిపారు. మణిపూర్ గురించి ప్రధాని మోడీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు అక్కడ ఏర్పడిన పరిస్థితులే ఇప్పుడు మణిపూర్‌లో కనిపిస్తున్నాయన్నారు. మైనారిటీలపై మెజారిటీల అణచివేత కొనసాగుతోందనీ అయినా ప్రధాని పట్టించుకోలేదని ఆక్షేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News