Saturday, November 23, 2024

సరికొత్త టాయ్స్ రూట్‌తో లాభాల బాట

- Advertisement -
- Advertisement -

Modi spoke to participants of Toykathan 2021

టాయ్‌కాథన్ 2021కు ప్రధాని సూచన

న్యూఢిల్లీ : ఆటబొమ్మలే కదా అని అనుకోకండి, ఈ బొమ్మలే మన దేశానికి సరికొత్త ఆర్థిక వ్యవస్థనూ కల్పించగలవని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో ఆటబొమ్మలు టాయ్స్ తయారీతో అత్యధిక స్థాయిలో ఆర్థిక వనరులను సంతరించుకోవచ్చు, ఇక్కడి ధనం విదేశాలకు తరలివెళ్లకుండా చూసుకోవచ్చునని, ఇది ఇండియాను ఈ టాయోకనమీలో మరింత ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. స్థానిక తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు ఇక్కడి బొమ్మలను కొనుగోలు చేయాలని కోరారు. ఆటబొమ్మల విక్రయానికి సంబంధించిన టాయ్‌కాథన్ 2021లో పాల్గొంటున్న వారితో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇప్పుడైతే మనం ఆటబొమ్మల తయారీ విక్రయాలలో వెనుకబడి ఉన్నామని , ఆబాలగోపాలానికి ఎంతో ఇష్టమైన ఆటవస్తువులను దాదాపు 80 శాతం వరకూ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకు వాటికి ఉండే ఆకర్షణ, ప్రత్యేకతలు కారణం అవుతున్నాయి.

ఈ విధంగా ప్రతి ఏటా మన డబ్బు విదేశాలకు తరలివెళ్లుతోందని ప్రధాని తెలిపారు. గ్లోబల్ టాయ్ మార్కెట్‌లో ఇండియా వాటా కేవలం 1.5 బిలియన్ డాలర్లు. అంటే దీని విలువ రూపాయలలో చూస్తే 11,000 కోట్లు. ప్రపంచస్థాయిలో దాదాపుగా ఈ మార్కెట్ విలువ రూ 7.5 లక్షల కోట్లు వరకూ ఉంటుంది. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ, మహిళా శిశు సంక్షేమం, మైక్రో స్మాల్ అండ్ మీడియం మంత్రిత్వశాఖల సంయుక్త ఆధ్వర్యంటో ఈ ఆటబొమ్మల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆటబొమ్మల తయారీ పెరిగితే సంబంధిత ఇతర వస్తువుల తయారీకి వీలేర్పడుతుంది. మనం ఎంత సంఖ్యలో ఆటబొమ్మలను తయారు చేశామనేది కాకుండా ఏ మేరకు ఇతరత్రా వ్యవస్థలను కూడా బలోపేతం చేసుకోవచ్చుననేది ఆలోచించాలని కోరారు.ఇంటరాక్టివ్ గేమ్స్‌పై దృష్టి సారించాలని, వినోదాత్మకం, విద్యాత్మకంతో దృష్టి కేంద్రీకృతం చేయగల (ఎంగేజ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేట్) టాయ్స్‌ను రూపొందించడం ద్వారా అందరినీ ఆకట్టుకోవచ్చునని అన్నారు.

టాయ్స్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించవచ్చు దీనితో సరికొత్త పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్ ఇప్పుడు ప్రపంచస్థాయిలో పెద్ద మార్కెట్‌గా మారాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా విరివిగా ఐఫోన్ స్మార్ట్‌ఫోన్లు, చీప్ డాటా, దండిగా ఇంటర్నెట్ సౌకర్యాలు, వీటికి ప్రజలు క్రమేపీ మొగ్గుచూపడం వంటి పరిణామాల నడుమ టాయ్స్ తయారీ వారు ఈ దిశలో తమ నైపుణ్యాన్ని అన్వయించుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. టాయ్‌కాథన్‌లో దాదాపు లక్షా 20వేలమంది కళాకారులు, పారిశ్రామికవేత్తలు దేశం నలుమూలల నుంచి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఈ వేదికకు 17000కు పైగా సరికొత్త ఆలోచనలను పంపించారు. ఇందులో 1567 ఐడియాలను గుర్తించి వీటిని మూడురోజుల టాయ్‌కాథన్ గ్రాండ్ ఫినాలేలో ఉంచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News