న్యూస్‌డెస్క్: మోడీ ఇంటిపేరుకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపి సుశీల్ కుమార్ మోడీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఏప్రిల్ 12న కోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ పాట్నా ఎంపి-ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సమన్లు జారీచేసింది.
మోడీ ఇంటిపేరు ఉన్న ప్రజలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ డిఫమేషన్ కేసును సుశీల్ మోడీ నమోదు చేశారు. దీనిపై కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మోడీ ఇంటి పేరు గలవారందరూ దొంగలంటూ వ్యాఖ్యానించారు.
నీరవ్ మోడీ, లలిత్ మోడీ వేల కోట్ల రూపాలయ దోచి దేశం విడిచి పారిపోయారని కూడా ఆయన అన్నారు. కాగా..పాట్నా ఎంపి-ఎమ్మెల్యే కోర్టులో సుశీల్ కుమార్ మోడీ కాకుండా మాజీ మంత్రి నితిన్ నవీన్, బంకిపూర్ ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా, బిజెవైఎం నాయకుడు మనీష్ కుమార్ ఇప్పటికే త సాక్షులుగా కోర్టులో తమ వాంగ్మూలాలను నమోదుచేశారు. ఇదే కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై కాంగ్రెస్ పార్టీ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. పాట్నా ఎంపి-ఎమ్మెల్యే కోర్టుకు కూడా రాహుల్ గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.