Friday, November 15, 2024

తక్షణం యుద్ధం ఆపండి

- Advertisement -
- Advertisement -

Modi talks with Danish Prime Minister over Russaia-ukraine war

చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి
రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్, డెన్మార్క్ పిలుపు
డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్‌సన్‌తో మోడీ చర్చలు

కోపెన్ హాగన్: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ పాటించి చర్చలు, దౌత్యమార్గాలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యాపై భారత్ తన పలుకుబడిని ఉపయోగిస్తుందన్న ఆశాభావాన్ని డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడెరిక్‌సన్ వ్యక్తం చేశారు. యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ మంగళవారం డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్‌సన్‌తో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో మోడీకి డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్‌సన్ స్వాగతం పలికారు. మేరిన్‌బోర్గ్‌లోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఉక్రెయిన్ సంక్షోభంతో పాటుగా పలు ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.

అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించి సంక్షోభ పరిష్కారానికి దౌత్య, చర్చల మార్గాన్ని ఎంచుకోవలసిందిగా మేము పిలుపునిస్తున్నాం’ అని మోడీ చెప్పారు. ఈ యుద్ధాన్ని, మారణ హోమాన్ని ఆపడానికి రష్యాపై భారత్ తన పలుకుబడిని ఉపయోగిస్తుందన్న ఆశాభావాన్ని ఫ్రెడరిక్‌సన్ వ్యక్తం చేశారు. ‘ పుతిన్ ఈ యుద్ధాన్ని, జన హననాన్ని ఆపాలన్నది నా స్పష్టమైన సందేశం. ఈ చర్చలో భారత్ కూడా రష్యాపై తన పలుకుబడిని ఉపయోగిస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని ఆమె అన్నారు. కాగా చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా, ప్రపంచ దేశాలపై ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావంపై చర్చించిన ఇరువురు నేతలు, ఈ అంశంపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని నిర్ణయించారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

కాగా భారత్‌లో మౌలిక సదుపాయాల రంగంలో, పర్యావరణ హిత పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని డెన్మార్క్ పరిశ్రమలు, పెన్షన్ ఫండ్స్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఇప్పటికే 200కు పైగా డేనిష్ కంపెనీలు భారత్‌లో ఉన్నాయని, ప్రభుత్వం తీసుకున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ చర్యల వల్ల అవి లబ్ధి పొందుతున్నాయని ఆయన చెప్పారు. ‘డేనిష్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్‌కు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి’ అని ప్రధాని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా డెన్మార్క్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ గౌరవార్థం రాత్రికి రాణి మార్గరెట్ 2 విందు ఇస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News