న్యూఢిల్లీ : పిఎంకిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద తొమ్మిదవ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాలో రూ.19,500 కోట్ల నగదును జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో ప్రధాన మంత్రి సంభాషించనున్నారు అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పిఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000లను కేంద్రం ప్రతి ఏడాది మూడు విడుతలలో విడుదల చేస్తుంది. ఒక్కొక్క విడతలలో భాగంగా రూ.2,000లను ప్రతి నెలలకు ఒకసారి జమచేస్తుంది. ఈ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో బదిలీ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రూ.1.38 లక్షల కోట్లకు పైగా సమ్మాన్ నిధిని రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొంటారు.