Sunday, December 22, 2024

రానున్న ఆస్ట్రియా పర్యటన ‘చరిత్రాత్మక సందర్భం’

- Advertisement -
- Advertisement -

సంబంధాల పటిష్ఠతకు ఎదురుచూస్తున్నా
రేపు వియన్నా వెళ్లనున్న ప్రధాని మోడీ
41 ఏళ్లలో ఆస్ట్రియా సందర్శించనున్న మొదటి భారత ప్రధాని
నేడు రష్యాలో మోడీ పర్యటన

న్యూఢిల్లీ : వచ్చే వారం ఆస్ట్రియాలో పర్యటించనుండడం ‘చరిత్రాత్మక సందర్భం’ అని, ఆ దేశానికి మొదటి సారి వెళ్లడం ఒక గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రకటించారు. భారత, ఆస్ట్రియా దేశాల మధ్య ద్వైపాక్షిక దౌత్య సంబంధాలు నెలకొని 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మోడీ పర్యటన జరగనున్నది. ప్రధాని మోడీ ఈ నెల 9, 10 తేదీల్లో ఆ దేశాన్ని సందర్శించనున్నారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాను సందర్శించడం 41 ఏళ్లలో ఇదే ప్రథమం. ప్రధాని మోడీ ఒక ట్వీట్‌లో ఆస్ట్రియా చాన్స్‌లర్ కార్ల్ నెహమ్మర్‌ను ట్యాగ్ చేస్తూ, భారత్, ఆస్ట్రియా మధ్య సంబంధాల పటిష్ఠతకు, సహకారానికి కొత్త రంగాల అన్వేషణకు ఎదురుచూస్తున్నానని తెలియజేశారు. ‘చాన్స్‌లర్ కార్ల్ నెహమ్మర్ ధన్యవాదాలు. ఈ చారిత్రక సందర్భంగా ఆస్ట్రియాను సందర్శించం గర్వకారణం.

మన దేశాల మధ్య సంబంధాలను దృఢతరం చేయడంపైన, సహకారానికి కొత్త రంగాలు అన్వేషించడంపైన మన చర్చల కోసం ఎదురుచూస్తున్నా. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన మన మధ్య సన్నిహిత భాగస్వామ్యం నిర్మాణానికి వేదిక అవుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆస్ట్రియాలో ప్రధాని మోడీ మొదటిసారిగా జరపనున్న పర్యటన ‘గణనీయమైన మైలురాయి’ అని ఆస్ట్రియన్ చాన్స్‌లర్ శనివారం అభివర్ణించిన తరువాత ఆయన ఈ విధంగా స్పందించారు. ‘పలు రాజకీయ సవాళ్ల’పై సన్నిహిత సహకారంపై సంప్రదింపులు జరిపేందుకు ఇది ఒక అవకాశం అని ఆయన అన్నారు. ‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చే వారం వియన్నాలో స్వాగతం పలికేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నా.

ఈ పర్యటన ప్రత్యేకంగా గర్వకారణం. ఎందుకంటే నలభై ఏళ్లకు పైగా ఒక భారత ప్రధాని జరపనున్న తొలి పర్యటన ఇది. గణనీయమైన మైలురాయి. భారత్‌తో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు సందర్భంగా మనం వేడుక జరుపుకుంటున్నాం’ అని నెహమ్మర్ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ఈ పర్యటనలో ఆస్ట్రియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్‌తో భేటీ అవుతారని, చాన్స్‌లర్‌తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఇఎఎం) వెల్లడించింది. ప్రధాని, చాన్స్‌లర్ ఉభయ దేశాల వాణిజ్య ప్రముఖులను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారని ఇఎఎం తెలియజేసింది.

రష్యా పర్యటన

ప్రధాని మోడీ సోమ, మంగళవారాల్లో ముందుగా మాస్కో సందర్శిస్తారు. 22వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానంపై మోడీ మాస్కో వెళుతున్నారు. సుమారు ఐదు సంవత్సరాల్లో ప్రధాని మోడీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి. మోడీ 2019లో రష్యాను సందర్శించారు. ఆయన అప్పుడు వ్లాడివోస్టాక్‌లో కీలక ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యారు. 22వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ, పుతిన్ ఉభయ దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి పలు అంశాలను సమీక్షిస్తారని, పరస్పర ప్రయోజనకర సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ విషయాలపై వారు పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకుంటారని ఎంఇఎ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News