Thursday, January 23, 2025

మోడీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి…

- Advertisement -
- Advertisement -

ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు : డి.రాజా

మన తెలంగాణ/హైదరాబాద్ : మోడీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. అధ్యక్ష తరహా పరిపాలన దిశగానే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారనే కొందరు సందేహిస్తున్నారని చెప్పారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశాన్ని బిజెపి ప్రభుత్వం నుండి విముక్తి కల్పించడమే లక్ష్యమని ప్రకటించారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశం, దేశ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన నెలకొన్నదని, అందుకే ఇండియా కూటమిలో సిపిఐ భాగస్వామిగా ఉన్నదన్నారు. భారతదేశాన్ని రక్షించేందుకు ‘దేశ్ బచావో.. బిజెపి హఠావో..’ ఇండియా కూటమి నినాదం ఇచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో రాజ్యాంగానికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో పని చేసే పార్టీలు గెలవాలని అన్నారు.

మూడు రోజుల పాటు జరిగే సిపిఐ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలకు రామకృష్ణ పాండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్ధూలు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ సమితి సమావేశాల్లో డి.రాజా ప్రారంభోపన్యాసం చేస్తూ భారతదేశం ప్రజస్వామిక దేశంగా ఉంటుందా, లౌకిక, గ్రణతంత్రంగా కొనసాగుతుందా? లేదా ఫాసిస్టు, నియంతృత్వ దేశంగా ఉండబోతుందా? అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో జరిగే జాతీయ సమితి సమావేశాలలో తాజా రాజకీయాలతో పాటు బిజెపిని ఓడించడం, పార్లమెంటు ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. బిజెపిని అధికారంలోని నుండి ఎలా తొలగించాలనేదే పెను సవాలు అని, దీనిని లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు ఎదుర్కోవాలని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణివేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుండి దేశాన్ని విముక్తి చేయాలని, ఇందుకు వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కార్పొరేట్ కంపెనీల కోసం పని చేసే సర్కార్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేదల కోసం ఏమీ ప్రకటించకపోగా, కార్పొరేట్ సంస్థలకు విధించే పన్నులను 32 శాతం నుండి 27 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారని డి.రాజా అన్నారు. తద్వారా మోడీ ప్రభుత్వం ఎవరి పక్షపాతినో స్పష్టమైందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్..సబ్ కా వికాస్, సబ్ ప్రయాస్.. అన్నీ సబ్ అంటుందోని, కానీ వాస్తవ పరిస్తితుల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని అన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలపై దృష్టి పెట్టామని కేంద్రం చెబుతుందని,ఈ వర్గాలకు మోడీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. గతంలో హామీ ఇచ్చినట్లు యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిచ్చారా? రైతులకు ఆదాయం రెట్టింపు చేశారా? మహిళలపై అత్యాచారాలు, దారుణాలను అరికట్టారా? అని నిలదీశారు. మోడీ హయాంలో భారతదేశంలో ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, మరోసారి మోడీ అధికారంలోకి వస్తే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ఇది మోడీ గ్యారంటీ అని చెబుతున్నారన్నారు. కాని దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నదన్నారు. పేదలను పట్టించుకోని మోడీ ప్రభుత్వం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు దాసోహంగా మారిందని, వారికి మద్దతుగా నిలుస్తోందని, అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని, వారి కోసమే పని చేస్తోందని రాజా మండిపడ్డారు. మోడీ పాలనలో యువత భవిష్యత్ అంధకారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ నిరుద్యోగ సూచీని చూడాలని, వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే మోడీ ప్రభుత్వం మాత్రం యువతపై దృష్టి సారించామని చెప్పడం విడ్డూరమన్నారు. ఒకవైపు 25 కోట్ల మంది పేదరికం నుండి బైటపడ్డారని చెబుతున్నారని, అంతర్జాతీయ ఆకలి సూచీలో 125 దేశాల మధ్య భారత దేశం 111వ స్థానంలో ఉన్నదని, మోడీ ప్రభుత్వం మాత్రం పేదలపై ఫోకస్ పెట్టామని చెబుతుందన్నారు. మోడీ తన పదేళ్ల కాలంలో కాలంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, హక్కులను అణచివేశారని మండిపడ్డారు. కార్పొరేట్ అనుకూలంగా , కార్పొరేట్ కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు.

మోడీ రాముడు, గాంధీ రాముడు వేర్వేరు
రాముని పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని, మోడీ చెప్పే రాముడు, గాంధీ చెప్పే రాముడికి తేడా ఉన్నదన్నారు. కాని మోడీ హయాంలో మతతత్వ రాజ్యంగా మారుస్తోందని, రాజ్యాంగాని, అందులోని మౌలిక సిద్ధాంతాలను , ప్రజాస్వామ్యం, లౌకికవ్యవస్థను కాలరాస్తోందని విమర్శించారు. గత పార్లమెంటు సమావేశాలలో ఎంత మంది ఎంపిలను సస్పెండ్ చేశారో అందరికీ తెలుసునని అన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యం ఉన్నతమైనదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పార్లమెంట్ కళ్లలాంటివని, అలాంటి ప్రతిపక్ష సభ్యులను గత పార్లమెంట్ సమావేశంలో సస్పెండ్ చేశారని విమర్శించారు. పార్లమెంటులో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని, పార్లమెంటు పని చేయకపోతే ప్రజాస్వామ్యం మరణిస్తుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పాడన్నారు. దేశ స్వాతంత్య్రం గొప్ప త్యాగాలు చేసిన సిపిఐకి బిజెపి ప్రభుత్వాన్ని కూలదేసే బాధ్యత ఉన్నదన్నారు. భారతదేశ స్వాతంత్రంలో ఎలాంటి పాత్ర లేని బిజెపి ,ఆర్‌ఎస్‌ఎస్ కబంధ హస్తాల నుండి దేశాన్ని కమ్యూనిస్టులు విముక్తి చేయాలని రాజా పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News