Saturday, November 23, 2024

మోడీ x మమత

- Advertisement -
- Advertisement -

Modi versus Mamata in west bengal

పశ్చిమ బెంగాల్‌లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని సందేహాతీతంగా నిరూపించాయి. కేంద్ర రాష్ట్ర పాలకుల మధ్య, వారి రాజకీయ పక్షాల మధ్య ఎన్నికలకు ముందు అధికారం కోసం ఎత్తులు, పైఎత్తులు వేసుకోడం, ప్రజల ముందు పరస్పరం పలచన చేసుకునే వ్యూహాలు ముమ్మరంగా సాగడం మామూలు అయినా అవి ముగిసిన తర్వాత వాటికి తప్పని సరిగా తెర పడాలి. రాష్ట్రాభివృద్ధి కోసం ఒకరికొకరు సహకరించుకోవాలి. ప్రజలకు మేలు చేసే విషయంలో, ఆకస్మిక కష్టాల నుంచైనా వారిని గట్టెక్కించే పనిలో పోటీపడాలి. అందుకు విరుద్ధంగా బెంగాల్‌లో ఎన్నికల నాటి కక్షలు అవి ముగిసిన తర్వాత కూడా కొనసాగడం, రాజ్యాంగం తరపున పని చేయవలసిన గవర్నర్ సైతం ఇందుకు ఉత్ప్రేరక పాత్ర పోషించడం విస్తుపోవలసిన విషయం. అంటించకుండానే రగిలే అగ్గి బరాటా రాజకీయ వేత్త మమతా బెనర్జీని ఓడించి బెంగాల్‌లో అధికారం కైవసం చేసుకోడానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయం అనేక మాసాలుగా ఫిరాయింపులు ప్రోత్సహించడం నుంచి కయ్యానికి కాలు దువ్వడం వరకు పలు కుయుక్తులు పన్ని శత విధాల ప్రయత్నించి విఫలమయ్యారు. మమతా బెనర్జీ వరుసగా మూడో సారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

దానిని జీర్ణించుకోలేక కేంద్ర పెద్దలిద్దరూ ఇప్పటికీ తొండి రాజకీయాన్ని దండిగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు తమ అలవాటు ప్రకారం రాజ్‌భవన్‌ను, సిబిఐ వంటి స్వతంత్ర కేంద్ర సంస్థలను కూడా వాడుకుంటున్నారు. మమత కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోక ముందే ఐదేళ్ల నాటి ‘నారద’ శీల శోధన కేసులో నిందితులుగా పేర్కొన్న ఆమె తాజా మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు సహా నలుగురిని సిబిఐ అరెస్టు చేయడం, అనేక మలుపుల తర్వాత హైకోర్టు వారికి బెయిల్ ఇవ్వడం తెలిసిందే. ఈ అరెస్టుల విషయంలో సిబిఐ ముందుగా శాసన సభ స్పీకర్ అనుమతి తీసుకోవలసి ఉండగా గవర్నర్ జగదీప్ ధంకర్ కనుసైగతో రంగ ప్రవేశం చేసింది. ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడగానే బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన బంధ్యోపాధ్యాయ విషయంలో కేంద్ర రాష్ట్రం మధ్య మళ్లీ చిచ్చు రగులుకున్నది. మే 31 (సోమవారం) న రిటైర్ కావలసి ఉండిన బంధ్యోపాధ్యాయను కొవిడ్‌తో పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న కారణంగా మరి మూడు మాసాల కాలం ఆ పోస్టులో కొనసాగించాలని మమతా బెనర్జీ మళ్లీ అధికార బాధ్యతలు చేపట్టగానే నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకు కేంద్ర ప్రభుత్వం మే 24న అనుమతి మంజూరు చేసింది. ఆ తర్వాత వారం రోజులకు ఆయన్ను చీఫ్ సెక్రెటరీ బాధ్యతల నుంచి తప్పించి ఢిల్లీకి పంపించవలసిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు మమత ససేమిరా అంగీకరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను పంపించేది లేదని తెగేసి చెబుతూ ఆమె కేంద్రానికి ప్రతి లేఖ రాశారు. అందుకు సహకరించమని కోరారు. సివిల్ సర్వీస్ ఆఫీసర్ల విషయంలో కేంద్రానికి మమత ప్రభుత్వానికి ఇది మొదటిది కాదు. ఇక ఈ ఘర్షణ మూడో అంకం, యాస్ తుపాను వేదికగా రక్తి కడుతున్నది. బెంగాల్‌లో కొన్ని జిల్లాలను కకావికలు చేసిన ఈ తుపానుపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయం గా అక్కడికి వెళ్లి మొన్న శుక్రవారం నాడు నిర్వహించిన సమీక్షా సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కాకపోడంపై బిజెపి విమర్శలు గుప్పించింది. ఆమె చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ సమావేశం గురించి తనకు తెలియజేసిన తీరును మమత తప్పుపట్టారు. కేవలం ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య జరిగి ఉండవలసిన భేటీకి గవర్నర్ ధంకర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, నందిగ్రామ్‌లో తనపై గెలిచిన తన మాజీ అనుచరుడు సువేందు అధికారి హాజరు కావడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలియజేశారు.

సమావేశానికి ఆమె హాజరు కాకుండా తుపాను ప్రాంతాల ఏరియల్ సర్వే తర్వాత ప్రధాని మోడీ కలయ్‌కుండా ఎయిర్ బేస్‌లో దిగినప్పుడు ఆయనను కలుసుకొని తుపాను విధ్వంసంపై నివేదికను, రూ. 20 వేల కోట్ల సాయం అందించాలన్న లేఖను సమర్పించి తాను కూడా తుపాను ప్రాంతాల సందర్శనకు వెళ్లిపోయారు. అందుకు ప్రధాని అనుమతిని తీసుకున్నానని చెబుతున్నారు. ఆమెతో పాటే వెళ్లిపోయిన చీఫ్ సెక్రెటరీ బంధ్యోపాధ్యాయను విధుల నుంచి తప్పించి ఢిల్లీ పంపించాలని సరిగ్గా ఆయన రిటైర్మెంట్ తేదీ నాడే కేంద్రం లేఖ రాసింది. ఇదే తుపానుకు గురైన పొరుగు రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రితో తలెత్తని ఘర్షణ వాతావరణం కేంద్రానికి, మమతా బెనర్జీతోనే రగలడం గమనించవలసిన అంశం. బంధ్యోపాధ్యాయను పంపలేమని కేంద్రానికి స్పష్టం చేసిన మమతా రాష్ట్ర శ్రేయసుకు తోడ్పడుతుందంటే ప్రధాని కాలు పట్టుకోడానికి సిద్ధమేనన్నారు. ఇంతటితోనైనా ఆమెతో, ఆమె ప్రభుత్వంతో అసఖ్యతకు కేంద్రం స్వస్తి చెబుతుందో లేక ఇలాగే రెచ్చగొడుతూ పోతుందో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News