Friday, November 22, 2024

ప్రజలకు ప్రధాని క్లాస్!

- Advertisement -
- Advertisement -

Modi video conference with CMs of North Eastern States

 

కరోనా మూడో దశ గురించి కేంద్ర ప్రభుత్వం తన ముందు జాగ్రత్తను, అప్రమత్తతను తరచూ తెలియజేస్తున్నది. రెండో దశ కరోనా ప్రజల ప్రాణాలను మంచి నీళ్ల ప్రాయంగా తోడేసి తాగేస్తున్నప్పుడు కనిపించని ఈ బాధ్యతాయుత ప్రవర్తన మూడో వేవ్ సందర్భంలోనైనా దేశ పాలకుల్లో సకాలంలో మేలుకోడం సంతోషించవలసిన అంశం. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మూడో దశ కరోనా తనంతట తాను రాదని, దానిని దాపురింపచేసుకోకుండా మనమే జాగ్రత్తలు గట్టిగా పాటించవలసి ఉందని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోడం, ఒకేచోట పదుగురు గుమిగూడడం వల్లనే కరోనా కేసులు భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతిని గుర్తు చేశారు. వాస్తవానికి ఇప్పుడు దేశంలోని ఒకటి రెండు రాష్ట్రాల్లో మినహా రెండో దశ కరోనా తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ లక్షకు వెళ్లిపోయిన జాతీయ స్థాయి కేసుల సంఖ్య 30 వేలకు తగ్గింది.

కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడడంతో లాక్‌డౌన్లు ఎత్తివేశారు. గతంతో పోలిస్తే ప్రజల్లో కొవిడ్ జాగ్రత్తలకు సంబంధించిన చైతన్యమూ పెరిగింది. ఎక్కువ మంది మాస్కులను విధిగా ధరిస్తున్నారు. ఇతర జాగ్రత్తలూ పాటిస్తున్నారు. జీవిక కోసం తప్పనిసరై బజార్లలో, పని స్థలాలలో పది మందితో కలవడం అనివార్యమైతే తప్ప అందుకు పాల్పడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలూ ఎప్పటికప్పుడు తగిన హెచ్చరికలు చేస్తూ అవసరమైన ఏర్పాట్లు గావిస్తూ జాగ్రత్తగా ఉన్నాయి. వరుస లాక్‌డౌన్ల వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయి ఇటు ప్రభుత్వాల ఆదాయాలు పడిపోయాయి, అటు ప్రజల ఉపాధులూ అంతరించిపోయాయి. అందుచేత కేసులు తగ్గిన రాష్ట్రాల్లో లాక్ ఓపెన్ చేశారు. రెండో దశ కరోనాకు ముందు దేశంలో ఎటువంటి అపాయంలేదనిపించిన స్థితి ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, తుపానుకు ముందు ప్రశాంతతలా. డెల్టా వేరియంట్ అనే కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది.

అదే మూడో వేవ్‌గా ఉవ్వెత్తున లేచి మరో ప్రళయాన్ని సృష్టించే ప్రమాదముంది. ఈసారి వచ్చే వేవ్ పసి పిల్లలకు సోకి ఘోర విషాదాన్ని సృష్టించనున్నదనే హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అవసరమైన ఆసుపత్రి పడకల ఏర్పాటు తదితర ముందు జాగ్రత్తలు ముమ్మరంగా తీసుకుంటున్నాయి. అయితే మూడో వేవ్ గురించి కేంద్ర పాలకులు చేస్తున్న హెచ్చరికలకు, వారు, బిజెపి పాలనలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచరణలో వ్యవహరిస్తున్న తీరుకు గణనీయమైన వైరుధ్యం కనిపిస్తున్నది. సుప్రీంకోర్టు పదేపదే మొట్టి కాయలు వేయడంతో దారికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం 1844 ఏళ్ల వయసులోని విస్తృత ప్రజానీకానికి తానే ఉచిత టీకాలు సరఫరా చేయడానికి అంగీకరించింది. రెండు, మూడు రోజుల క్రితం అందిన సమాచారం ప్రకారం ఇంత వరకు దేశ జనాభాలో 5.4 శాతం మందికే రెండు డోసుల టీకాలు అందాయి. మొత్తం 37.7 కోట్ల మందికి టీకాలు పడగా, వారిలో రెండు డోసులు పూర్తిగా వేయించుకోగలిగిన వారు 7.35 కోట్ల మందే.

అమెరికాలో ఇప్పటి వరకు జనాభాలో 48.5 శాతం మందికి, జర్మనీలో 42.7 శాతం మందికి, బ్రెజిల్‌లో 14.5 శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు పడ్డాయి. టీకాలు వేసే పని ఎంత ఎక్కువగా పూర్తి అయితే కరోనా ఉధృతికి అంత గట్టిగా అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ అది సోకినా ప్రాణాంతక స్థాయికి చేరుకోకుండా ఉంటుంది. కేంద్రం టీకాలు కొని రాష్ట్రాలకు పంచడం ప్రారంభమైన తర్వాత ఒక దశలో రోజుకి 80 లక్షలకు మించి టీకాలు వేశారు. ఇప్పుడది సగానికి పడిపోయింది. ఇందుకు కేంద్రం వైఫల్యమే కారణం. అక్కడి నుంచి రాష్ట్రాలకు టీకా డోసుల సరఫరా తగ్గిపోయింది. కుంభమేళా, భారీ ఎన్నికల సభలు రెండో దశ కరోనాను గరిష్ఠ స్థాయికి రెచ్చగొట్టి అసంఖ్యాకంగా ప్రాణాలు బలి తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి ముందు గత ఏడాది వేలెత్తి చూపిన తబ్లిఘీ చిరుచిన్నదైపోయింది. కరోనా మొదటి దశలో లక్ష 57 వేల మంది మరణించగా, రెండో దశ వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి అధికారిక సంఖ్య రెండున్నర లక్షలు కావడం గమనించవలసి విషయం.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 25న మొదలుకానున్న ‘కన్వర్’ యాత్రకు అనుమతి ఇవ్వడం విడ్డూరం కాదా! నీతులు చెప్పేవారే వాటికి గోతులు తవ్వడం కిందికి రాదా! ‘కన్వర్’కు అనుమతి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తనంత తానుగా విచారణకు తీసుకొని తీవ్రంగా స్పందించింది. ఈ యాత్ర సందర్భంగా ఉత్తరాదిలో భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు అసంఖ్యాకంగా వెళ్లి అక్కడి గంగా జలాలను సేకరించి తెచ్చుకుంటారు. 15 రోజుల పాటు సాగే ఈ యాత్రలో జనం ఎంతగా అక్కడ గుమిగూడి కరోనా వ్యాప్తికి వాహకులవుతారో చెప్పనక్కర లేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు ప్రధాని హెచ్చరిస్తుండగా ఇటువంటి సన్నివేశాలకు బిజెపి ప్రభుత్వాలే అనుమతి ఇవ్వడాన్ని ఏమనాలి?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News