Monday, December 23, 2024

తెలంగాణపై బిజెపిది సవతి తల్లి ప్రేమ

- Advertisement -
- Advertisement -

విభజన హామీలపై స్పందించని మోడీ

కోచ్ ఫ్యాక్టరీ సాధనకై ఉద్యమాలు కొనసాగిస్తాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

మన తెలంగాణ/హన్మకొండ టౌన్:- రాష్ట్ర విభజన హామీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయంపై హనుమకొండ సభలో మోడీ స్పందించక పోవడం ప్రజలను మోసగించడమేనని అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతుంటే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

గుజరాత్ రాష్ట్రంలో 20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన కేంద్రం కాజీపేటలో కేవలం రూ. 521 కోట్లతో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు తమ పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈ ప్రాంత అభివృద్ధి పై శ్రద్ద వుంటే ప్రధాని మోడీ సభకు హాజరై విభజన హామీలపై ప్రశ్నించాల్సి ఉండాల్సిందని శ్రీనివాస రావు అడిగారు. అటు మోడీ, ఇటు కెసిఆర్ బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ఒకటి కాదని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విభజన హామీల అమలుపై ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామునూర్ లో ఏయిర్ ఫోర్టు నిజాం కాలం నుంచి ఉందని, దానికి అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని రాక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల ముందే వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి,జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, నకీర్త ఓదెలు, మాలోతు శంకర్, జక్కు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: సివిల్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థికి రూ.లక్ష ఆర్థిక సహాయం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News