Monday, December 23, 2024

ఇతరుల సంతోషంలోనే అమ్మకు ఆనందం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన తల్లి హీరాబెన్‌ను స్థిత ప్రజ్ఞతకు చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. చాలా చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన తన తల్లి హీరాబెన్ బాల్యంలో చాలా కష్టాలను అనుభవించారని ఆయన తన బ్లాగ్ పోస్టులో గర్తు చేసుకున్నారు. తన తల్లికి ఆమె తల్లి ముఖం కూడా గుర్తు లేదని, ఆమె ఏనాడూ తల్లి ఒడిలో నిద్రించిన క్షణం లేదని, బాల్యమంతా తల్లి తోడు లేకుండానే ఆమె గడిపారని మోడీ తెలిపారు. చిన్న తనంలో తమకుటుంబం వాద్‌నగర్‌లో మట్టితో నిర్మించిన ఒక పెంకుటింట్లో నివసించిన గతాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. తన తల్లి సాగించిన నిత్యపోరాటాన్ని ఆయన ప్రస్తావించారు.

వర్షం పడితే పైకప్పులో నుంచి నీళ్లు ఇంట్లోకి కారేవని, వర్షపునీరు పట్టేందుకు బకెట్లు, పాత్రలు పెట్టిన రోజులను ఆయన తలచుకున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితులోనూ ఏనాడూ తన తల్లి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేది కాదని ఆయన తెలిపారు. ఇంట్లోపనంతా తన తల్లి ఒక్కరే చేసుకునేవారని, చాలీచాలని ఆదాయంతో ఇల్లు నెట్టుకురావడం కష్టమని తాను కూడా ఇరుగుపొరుగు ఇళ్లలో వంటపాత్రలు తోమేవారని మోడీ గుర్తు చేసుకున్నారు. అంతేగాక ఇంటి ఖర్చుల కోసం చరఖాతో నూలు వడికేవారని కూడా ఆయన తెలిపారు. పారిశుధ్య పనివారి పట్ల తన తల్లి ఎంతో గౌరవభావంతో ఉండేవారని, మొదటి నుంచి ఆమెకు శుచి శుభ్రత పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు ఉండేవని ఆయన తెలిపారు.

వాద్‌నగర్‌లో తమ ఇంటి పక్కన కాలువను శుభ్రం చేయడానికి వచ్చే పారిశుధ్య కార్మికులకు టీ ఇవ్వకుండా ఆమె పంపేవారు కాదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇతరుల సంతోషంలోనే తన ఆనందాన్ని ఆమె వెతుక్కునేవారని, ఆమెది చాలా విశాల హృదయమని మోడీ తన తల్లి గురించి తెలిపారు. ఒకరోజు తన తండ్రి అకాల మరణం పొందిన తన సన్నిహిత మిత్రుడి కుమారుడు అబ్బాస్‌ను వాద్‌నగర్‌లోని తమ పూరింటికి తీసుకువచ్చారని, ఇక నుంచి అబ్బాస్ కూడా మనతోనే ఉంటాడని ఆయన చెప్పినపుడు తన తల్లి అతడిని కూడా ఆదరించిందని, తన పిల్లలతో సమానంగా అబ్బాస్‌ను కూడా చూసుకుందని మోడీ తెలిపారు. అక్కడే తమతోనే ఉంటూ అబ్బాస్ చదువును పూర్తి చేసుకున్నాడని ఆయన తెలిపారు. తన తల్లి జీవితగాథలో ఆమె అనుభవించిన కష్టాలను, త్యాగాన్ని, భారతదేశ మాతృశక్తి సేవలను తాను దర్శిస్తానని మోడీ పేర్కొన్నారు. తన తల్లిని, దేశంలోని కోట్లాదిమంది మహిళలను చూసినపుడు తనకు భారతీయ మహిళ సాధించలేనిది ఏదీ లేదన్న జీవిత సత్యం తాను గ్రహిస్తానని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News