కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల
స్వీకరణ లేదు అలాంటి ఉత్తర్వులు
ఏవీ జారీ చేయలేదు పౌరసరఫరాలశాఖ
స్పష్టీకరణ రేషన్‌కార్డుల జారీని
ఆపలేదు : ఎన్నికల సంఘం వివరణ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఆహారభద్రత(రేషన్) కార్డుల్లో మార్పుచేర్పులపై మాత్రమే ఈదఫా అవకాశం ఉంటుంది. ఇటీవల ప్రజలు ప్రజావాణి, గ్రామసభలు, ప్రజా పాలన సేవాకేంద్రాలకు అందిన ధరఖాస్తులను పరిశీలించాలని మాత్రమే మీ సేవా డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడింది. అంతర్గతంగా ఉన్న ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రచారం జరిగింది. దాంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అర్హత కలిగిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడంతో గందరగోళం చోటుచేసుకుంది.
దాంతో ఈ విషయం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో శనివారం సాయంత్రం పౌరసరఫరాల శాఖ ఈ అంశంపై స్పందించి వివరణ ఇచ్చింది. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయిందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ అంశంపై కొత్త రేషన్ కార్డు లకు బ్రేక్ అంటూ వస్తున్న వార్తలపై ఎన్నికల కమిషన్ అధికారికంగా వివరణ ఇచ్చింది. ఆ వార్తలు నిజం కాదని పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను, వాటిలో మార్పులు, చేర్పులను నిలిపివేస్తున్నట్లుగా ఎన్నికల ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలంగాణ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సి.సుదర్శన్ రెడ్డి ప్రకటన జారీచేశారు.