న్యూఢిల్లీ: తమ బాధను చెప్పుకునేందుకు ఒక అవకాశం ఇవ్లాలని భారత మహిళా రెజ్లర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. బేటీ బచావో, బేటీ పడావో నినాదాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకీ రాజధాని ఢిల్లీలో తాము చేస్తున్న ఆందోళన కనిపించడం లేదా అని రెజ్లర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ సమస్యలపై మన్‌కీ బాత్ ద్వారా తెలుసుకుంటున్న ప్రధాని తమ సమస్య విషయంలోనూ స్పందించాలని మహిళా రెజ్లర్లు సాఓఇ మలిక్, వినేశ్ ఫొగాట్, సంగీత తదితరులు కోరారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కానీ, ఢిల్లీ పోలీసులకు కానీ ఈ విషయంలో స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని, ఈ విషయంలో అతనిపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రెజ్లర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ చండ్రచూడ్ పర్యవేక్షణలోని సుప్రీం కోర్టును విచారణకు స్వీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడుతున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేగాక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు సయితం జారీ చేసింది. ఇదిలావుంటే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. వినేశ్ ఫొటాట్, సంగీత ఫొగాట్, బబితా ఫొగాట్, భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
Also Read: ఇంటర్ పాసైన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
మరోవైపు జమ్మూకశ్శీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ రెజ్లర్లకు అండగా నిలిచారు. వారు నిరసన చేపట్టిన దీక్ష శిబిరాన్ని సత్యపాల్ సందర్శించారు. ఈ సందర్భంగా రెజ్లర్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం చివరి వరకు పోరాడాలని, తామంతా అండగా ఉంటామని సత్యపాల్ రెజ్లర్లకు భరోసా ఇచ్చారు. ఇదిలావుంటే రెజ్లర్ల ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసి ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు డిమాండ్ చేస్తున్నారు.