Tuesday, January 7, 2025

మోడీజీ…మాకు ఇచ్చిన మూడు హామీల మాటేమిటి?

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్ వేదికగా మోడీని నిలదీసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధాని వరుస పర్యటనలపై బిఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికలప్పుడే ప్రధానికి తెలంగాణ గుర్తొస్తుందా? అంటూ బిఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో రెండో సారి వస్తున్న సందర్భంగా రాష్ట్రానికి ఏం చేశారని నిలదీస్తూ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశారు. మూడు రోజుల్లో రెండోసారి రాష్ట్రానికి వస్తున్న‘మోడీజీ.. మూడు హామీల సంగతి ఏంటి?’ అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ ప్రశ్నలు సంధించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదాపై ప్రధాని మోడీని మంత్రి కెటిఆర్ నిలదీశారు.

మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మూడు విభజన హక్కులకు దిక్కేది? అంటూ నిలదీశారు. పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? అంటూ ప్రశ్నించారు. ‘మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు’ అని అడిగారు. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలు గుచ్చుతారా? అంటూ ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటిఐఆర్‌ను ఆగం చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు. దశాబ్దాల పాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారంటూ’ ట్విట్టర్ వేదికగా మోడీని గట్టిగా మంత్రి కెటిఆర్ నిలదీశారు.

బిజెపి పదేళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు 140 కోట్ల భారతీయులను మోసం చేశారన్నారు. ‘2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఇస్తామన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాట అయినా నెరవేర్చరా..?’ అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు మరి అది అమలు అయ్యేది ఎప్పుడో అంటూ పసుపు బోర్డు ప్రకటనపై సెటైర్ వేశారు. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో అదానికి తప్ప ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి? అంటూ ప్రశ్నించారు . మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపి గూడు చెదరడం పక్కా అని చెప్పారు. మళ్లీ వంద స్థానాల్లో బిజెపి డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని’ మంత్రి కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News