Monday, January 20, 2025

మోడీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలి

- Advertisement -
- Advertisement -
సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు నిరంకుశ విధానాలను తిప్పి కొట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా యువతకు పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ మత ఛాందస విధానాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఆయన అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జాతీయ వర్క్ షాప్ తొలి రోజు ప్రారంభ సెషన్ హిమాయత్‌నగర్‌లోని సత్య నారాయణ రెడ్డి భవన్లో శనివారం జరిగింది. ఈ ప్రారంభ సెషన్‌కు ముఖ్య అతిథిగా హాజరై అజీజ్ పాషా మాట్లాడుతూ మోడీ తన వ్యక్తిత్వ వికాసానికి లక్షలాది నిధులు వెచ్చిస్తున్నారని ఆరోపించారు.

ప్రధానమంత్రి మతపరమైన నినాదాలు, విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా..దక్షిణ భారత దేశంలో బిజెపి గేట్‌వే మూసుకుపోయిందని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల్లో జై బజరంగబలి అంటూ నినాదాలు చేసినా.. ప్రజలు స్పందించలేదన్నారు.

ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయని, దీనిపైనే బిజెపి దృష్టి సారిస్తోందని,విపక్షాల ఐక్యతతోనే బిజెపిని ఓడించవచ్చని సర్వేలు కూడా చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువత ఉద్యమించాలని అన్నారు. కొంతమంది బి- టీమ్ నాయకులు అతనికి సహాయం చేయవచ్చని, ఇటువంటి సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. మన దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద ఆందోళన అని అనేక నివేదికలు సూచిస్తున్నాయని అజీజ్‌పాష అన్నారు. ఈ సమస్యలను బలమైన ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సుఖేందర్ మహేసరి, తిరుమలై రామన్‌లు సంయుక్తంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు పాలకులను ఉద్యమాల ద్వారా యువత మేల్కొల్పాలని వారు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ టిటి.జిస్మాన్, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News