Wednesday, January 22, 2025

బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే విద్వేషపూరిత ప్రసంగాలు అధికం: నివేదికలో వెల్లడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్థంలో ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన విద్వేష ప్రసంగాలలో అత్యధికం బిజెపి పాలిత రాష్ట్రాలలోనే చోటుచేసుకున్నట్లు ఒక నివేదిక సోమవారం వెల్లడించింది.

ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన 255 విద్వేషపూరిత ప్రసంగాలలో దాదాపు 80 శాతం బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చోటుచేసుకున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ డిసికి చెందిన పరిశోధనా గ్రూపు హిందూత్వ వాచ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లోని ముస్లిములు, ఇతర మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలను, నేరాలను ఈ గ్రూపు అధ్యయనం చేస్తోంది.

2014లొ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాల పోకడ భారత్‌లో పెరుగుతోందని హిందూత్వ వాచ్ పేర్కొంది. ఈ ఏడాది ప్రథమార్థంలో చోటుచేసుకున్న ఘటనలలో సగానికి పైగా అధికార బిజెపి, దాని అనుబంధ సంఘాలైన బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్, సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో జరిగినవేనని గ్రూపు పేర్కొంది. బిజెపి సిద్ధాంత రూపకర్తగా భావించే ఆర్‌ఎస్‌ఎస్‌తో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నట్లు గ్రూపు తెలిపింది.

భారత్‌కు చెందిన క్రైమ్ బ్యూరో 2017 నుంచి విద్వేషపూరిత నేరాలకు సంబంధించిన వివరాల సేకరణను నిలిపివేసిన తర్వాత విద్వేషపూరిత ప్రసంగాలపై ఒక గ్రూపు స్వతంత్రంగా వివరాలు సేకరించడం ఇదే మొదటిసారి. తన వివరాల సేకరణకు వార్తా పత్రికలు, సోషల్ మీడియా క్లిప్పింగ్స్‌పైన ఈ గ్రూపు ఆధారపడింది. వీడియోలు, జర్నలిస్టులు, పరిశోధకుల ద్వారా వార్తలలోని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే తన నివేదికను రూపొందించినట్లు గ్రూపు తెలిపింది.

ముస్లిములకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు అత్యధికంగా మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లో చోటుచేసుకున్నట్లు హిందూత్వ వాచ్ తెలిపింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలోనే విద్వేషపూరిత ప్రసంగాలలో మూడవ వంతు చోటుచేసుకున్నాయని గ్రూపు తెలిపింది.

కాగా..ఈ నివేదికను పూర్తి నిరాధారమైనదిగా న్యూఢిల్లీలోని బిజెపి సీనియర్ నాయకుడు అభయ్ వర్మ ఖండించారు. ప్రజలను వారి మతాల ఆధారంగా బిజెపి విభజించబోదని ఆయన చెప్పారు. విద్వేషపూరిత ప్రసంగాలను బిజెపి ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోదని కూడా ఆయన చెప్పారు.

అయితే&విద్వేషపూరిత ప్రసంగాలను ఎదుర్కోవలసిన ప్రభుత్వ అధికారులే వీటిలో పాలుపంచుకుంటున్నారని హిందూత్వ వాచ్ తన నివేదికలో పేర్కొంది. ముస్లిములకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిలో బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ నాయకులు ఉన్నారంటూ హిందూత్వ వాచ్ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News