న్యూఢిల్లీ : అఖిల భారత చౌకడిపో డీలర్ల ఫెడరేషన్ వివిధ డిమాండ్లను బలపరుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ధర్నా చేయనున్నారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షునిగా ఉన్న ఆయన ఫెడరేషన్ మిగతా సభ్యులతో కలిసి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ ప్రధాని మోడీకి మెమోరాండం సమర్పించనున్నారు. బుధవారం స్పీకర్ ఓం బిర్లాను కలుసుకోడానికి సభ్యులు ప్రయత్నిస్తున్నారు. చౌక డిపోల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం, గోధుమ, చక్కెర, వంటనూనెలు, కాయధాన్యాలు తదితర నిత్యావసరాలపై వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి నష్టపరిహారం చెల్లించాలన్నది వీరి తొమ్మిది డిమాండ్లలో ఒకటి. ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి పశ్చిమబెంగాల్ రేషన్ మోడల్‌ను దేశమంతటా అమలు చేయాలని ఈ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. జమ్ము, కశ్మీర్‌తోపాటు అన్ని రాష్ట్రాల బకాయిలను తక్షణం రీఎంబర్స్ చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు.