మన తెలంగాణ/సూర్యాపేట/హుజూర్‌నగర్/చండూరు : బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలతో తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడితే.. కేంద్రం రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం మంచి పనులు చేసిందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేంద్రాన్ని ఘాటుగానే ప్రశ్నించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, చండూరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కెటిఆర్ చండూరులో రూ.40కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంత్రి జగదీష్ రెడ్డి, ఎంఎల్‌ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్, చండూరులలో జరిగిన బహిరంగ సభలో కెటిఆర్ ప్రసంగించారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్ర జలు వివిధ పన్నుల రూపంలో ఎనిమిదేళ్లలో కట్టిన రూ.3.6 లక్షల కోట్లు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చింది రూ. 1.68 వేల కోట్లు మాత్రమేనన్నారు.
తెలంగాణ పన్నుల రూపం లో కడుతున్న నిధులతో బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పను లు చేస్తున్నారని.. నేను చెప్పేది అబద్ధమైతే.. నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. నేను చెప్పింది తప్పని రుజువు చేయకపోతే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తావని అనుకోను కానీ, కనీసం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పే సంస్కారం ఉందా? అని కిషన్‌రెడ్డికి మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్షా 24వేలుగా ఉంటే.. నేడు రూ.2లక్షల 78వేలుగా ఉందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వలో దేశ తలసరి ఆదాయం రూ.లక్షా 49వేలు మాత్రమేనని, అంటే మనలో సగం మాత్రమేనన్నారు. అటువంటప్పడు ఎవరు సమర్థుడు? ఎవరు అసమర్థుడు?” అని కెటిఆర్ ప్రశ్నించారు.
మీరు ఆశీర్వదిస్తే డబుల్ స్పీడ్‌తో పని చేస్తాం
ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు గురంచి మాట్లాడుతాం.. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు.. కానీ, పని చేసిన ప్రభుత్వం, పని చేసిన నాయకులు కోరుకునేది ఒక్కటే.. ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలవాలని, పనిచేసే నాయకులను మీరు గుర్తించి ఆశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహంతో, డబుల్ స్పీడ్‌తో పనిచేస్తామని కెటిఆర్ అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు నియోజకవర్గాలను అనాథలుగా చేశారు. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని గుర్తు చేశారు. కానీ, ప్రభాకర్ రెడ్డి గెలిచిన గెలిచిన తర్వాత నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం.. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో మీ ఆదరణ, ప్రోత్సాహం ఇదే విధంగా ఉండాలని కెటిఆర్ కోరారు.
పేదోడి ముఖంలో చిరునవ్వు లేకపోతే అది పనికిమాలిన ప్రభుత్వమే
పేదోడి ముఖంలో చిరునవ్వు లేకపోతే అది పనికిమాలిన ప్రభుత్వం కింద లెక్క అని కెసిఆర్ అంటుంటారని కెటిఆర్ గుర్తు చేశారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చి ఫ్లోర్‌సిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. ఆడబిడ్డల కష్టాలను తీర్చింది కెసిఆర్ మాత్రమేనని, సాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మారిపోయే పార్టీ బిఆర్‌ఎస్ కాదన్నారు. మారిపోయే ప్రభుత్వమూ కాదు. ఎన్నిక ముందైనా, ఎన్నికల తర్వాతైనా అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తాం అని మంత్రి స్పష్టం చేశారు.
నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ చండూరులో రూ.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు. రూ.30కోట్లతో మెయిన్‌రోడ్డుకు శంకుస్థాపన చేశామన్నారు. రాబోయే నాలుగైదు నెల్ల్లోనే సుందరమైన చండూరును పరిచయం చేస్తామన్నారు.
పనిచేసే నాయకుడుంటే పనులు జరుగుతాయి..
పట్టించుకునే నాయకుడు ఉంటే.. ఇంత వేగంగా పనులు జరుగుతామని కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎ కూసుకంట్ల ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి కెటిఆర్ అన్నారు. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయి 60 రోజులు అవుతోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాదిరిగానే బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారన్నారు. చెప్పినట్టుగా రెండు నెలల్లో ఇది రెండోసారి రావడం. ఉత్తి చేతులతో ఊపుకుంటూ వచ్చి ఊకదంపుడు ఉపాన్యాసాలు చేయట్లేదు. ఇచ్చిన హామీల మేరకు పనిచేసి వెళ్తున్నామన్నారు.
దేశానికి వేగు చుక్క మన తెలంగాణ
బిజెపి వల్ల కార్పొరేట్ శక్తుల బాగుపడ్డాయి తప్ప.. ప్రజలు మాత్రం అమాంతం అగాధంలోకి వెళ్లారన్నారు. మోడీ వల్ల దేశం అప్పులపాలై.. అభాసుపాలైందని కెటిఆర్ దెప్పిపొడిచారు. దేశానికి వేగు చుక్క మన తెలంగాణ అని మంత్రి కెటిర్ స్పష్టం చేశారు. బిజెపి ప్రమాదకరమైన పార్టీ, దాని ఉచ్చులో యువత పడొద్దని కెటిఆర్ సూచించారు. మతాల మధ్య పంచాయితీలు పెట్టడం ఆ పార్టీ నేతల నైజం అని విమర్శించారు. కిషన్ రెడ్డి లాంటి కేంద్రమంత్రి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేవన్ని అబద్ధాలే.. నిలదీస్తే.. ఒక్క సమాధానం కూడా చెప్పడని విమర్శించారు. రూ.30వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
ఇంటింటికి సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగుపడ్డాయన్నారు. భారతదేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని కెటిఆర్ తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత హుజుర్‌నగర్ శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఎవరివల్ల రాష్ట్రం ముందుకుపోతుందో ప్రజలే గమనించాలని సూచించారు. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా మారింది.. దేశాన్ని బాగు చేయాలన్నదే కెసిఆర్ లక్ష్యం అని మంతి తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు మెదపని నేతలు బిజెపి నాయకులని కెటిఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవాల్ని కుట్రలు చేస్తున్నది బిజెపి అని మండిపడ్డారు.