Monday, December 23, 2024

విపక్ష రాష్ట్రాలపై మోడీ వివక్ష

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాలకు నిధులు, పన్నుల వాటాల బదలాయింపులో తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో వామపక్ష ఫ్రంట్, తమిళనాడులో డిఎంకె, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ రాష్ట్రంలో జెఎంఎం నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో వున్నాయి. పన్ను వాటాల బదలాయింపులో మోడీ ప్రభుత్వ వివక్షా పూరిత వైఖరికి నిరసనగా ఈనెల 7న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా జరిపారు. ఆ మరునాడు కేరళ సిఎం పినరయ్ విజయన్ నాయకత్వాన వామపక్ష ఫ్రంట్ నేతలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం నుండి న్యాయమైన వాటా కోసం ఢిల్లీలో అదే చోట ధర్నా చేయడం సంచలనం కలిగించింది.

రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రతిపక్షాలు ఏకం కాకుండా కకావికలు చేయడమే కాక ఆ ప్రభుత్వాలు మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయకుండా అడ్డుకొని బలహీన పరచడానికి రాజ్యాంగబద్ధంగా ఆ రాష్ట్రాలకు బదలాయించాల్సిన నిధులలో కోత విధించడం ప్రతిపక్షాలకు ఆగ్రహ కారణమైంది. ఈ నిరసనలు కేంద్రానికి కొంత కలవరం కలిగించాయి. జాతిని విచ్ఛిన్నం చేసే ఇలాంటి నిరసనలు తగవని ప్రధాని వ్యాఖ్యానించారు.ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, ఇందులో ఎలాంటి వివక్షకు తావులేదని, తమ ప్రమేయం ఏమీ ఉండదని, దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ వి.సోమనాథన్ వివరించారు. గుజరాత్ నుండి రూ. 40 వేల కోట్ల మొత్తం కేంద్రానికి అందగా అందులో 2.5% మాత్రమే కేంద్రం నుండి పన్నుల వాటాగా వచ్చిందని నరేంద్ర మోడీ 2008లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నపుడు వ్యాఖ్యానించి సంచలనానికి తెర తీశారు. కేంద్ర పన్నుల వాటాను 32 నుండి 50 శాతానికి పెంచాలని కూడా అప్పట్లో నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు.

ఇప్పుడు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీవునేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు అవే డిమాండ్లను ముందు కు తెచ్చారు.ఆర్థిక సంఘాల సిఫార్సుల గణాంకాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు 2014 15 లో పన్నుల వాటా బదలాయింపులు 18.62 శాతం కాగా, అది 2021 -22 నాటికి 15.8 శా తానికి తగ్గాయి. 15వ ఆర్థిక సంఘం తొలి ఏడాదిలోనే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు 18.5 శాతానికి తగ్గడం చూస్తే అందుకు తీసుకున్న ప్రాతిపదికలు ప్రశ్నార్థకం అయినవేనని భావిస్తున్నారు. 14, 15 ఆర్ధిక సంఘాలు జనాభా, జనగణన ఆధారంగా పన్ను లు, నిధుల బదలాయింపును నిర్ధారించాయి.

పన్నుల బదలాయింపులకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని 2024- 25 తాత్కాలిక బడ్జెట్లో 25 కోట్ల జనాభా గల యుపికి మొత్తం నిధులలో 18 శాతం కేటాయించారు. డబుల్ ఇంజిన్ సర్కారు (కేంద్రంలో మోడీ, యుపిలో యోగీ) అధికారంలో ఉండటమే అందుకు కారణం. యుపిలో 80 లోక్‌సభ స్థానాలుఉన్నందున మోడీ వరుసగా ప్రధాని కావాలంటే అక్కడ పువ్వు పార్టీ అధిక స్థానాలు గెలవడం రాజకీయ అవసరం. 2014లో 72, 2019లో కమలం పార్టీ 72 స్థానాలు గెలిచిన విషయం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు 4 శాతం, కర్నాటకకు 3 శాతం, తెలంగాణకు 2 శాతం, కేరళకు ఒక్క శాతం మాత్రమే నిధులు కేటాయించారు.

2021- 22లో కేరళ రెవెన్యూలో 38.44 శాతం కేంద్రం నుండి పన్నుల ఆదాయం బదలాయింపు ద్వారా లభించింది. 16 వ ఆర్ధిక సంఘం వివిధ రాష్ట్రాలలో వాస్తవిక దృక్పథంతో పరిస్థితులను అవగాహన చేసుకుని మెరుగైన పనితీరు కనబరచిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేసే విధంగా ఆయా రాష్ట్రాలతో, ఆర్థిక, ప్రణాళికావేత్తలతో చర్చించి తగు విధివిధానాలను రూపొందించుకోవాలి. దేశంలో 2022- 23 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ. 16.27 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల్లో మహారాష్ట్ర నుంచి రూ. 6.14 లక్షల కోట్లు, ఢిల్లీ నుండి రూ. 2.12 లక్షల కోట్లు, కర్నాటక నుండి రూ. 2.05 లక్షల కోట్లు, తమిళనాడు నుండి 1.07 రూ. లక్షల కోట్లు వసూలు అయ్యాయి. మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, జిడిపి వృద్ధికి తోడ్పడే పట్టణాభివృద్ధి, నగరీకరణకు ఈ రాష్ట్రాలు పెట్టిందిపేరు.
అలాంటి మెరుగైన ఫలితాలు సాధించిన అభ్యుదయ రాష్ట్రాలకు నిధులు తగ్గించి, యుపి 25 కోట్లు, బీహార్ 13 కోట్లు, మధ్యప్రదేశ్ 6 కోట్లు, రాజస్థాన్ 6 కోట్ల జనాభాలో ముందున్నా ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉద్యోగ ఉపాధి కల్పనలో వెనుకబాటుతో మందగమనమే.

అలాంటి ఎదుగూ బొదుగూ లేని రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, మెరుగైన ఫలితాలు సాధించిన అభ్యుదయ రాష్ట్రాలకు తక్కువ నిధులివ్వడం దేశ పురోగతికి తోడ్పడదు. కేంద్రం జిఎస్‌టిని ఆశాస్త్రీయంగా అమలు చేయడం వల్ల 201724 మధ్య కర్నాటకకు రూ. 59,294 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినపుడు శాసన సభలో తెలియజేశారు. కర్ణాటకలో జిఎస్‌టి ద్వారా రాబడి 18% పెరిగిందని, సొంత పన్నుల ఆదాయం లో 12% వృద్ధి ఉన్నట్లు సిద్దరామయ్య తెలిపారు. అందుకే సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో రూ. 1.2 లక్షల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గినప్పుడు రాష్ట్రాలను ఆదుకోవడానికి స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు సొంత ఆదాయాన్ని పెంచుకున్నా, వివిధ పథకాలకు, సంక్షేమానికి ఎక్కువ వ్యయం చేయాల్సిఉంది. 2011- 12లో 88% పన్ను రాబడిని రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి అందుబాటులో ఉండగా, 2024- 25లో నిధులు 77 శాతానికి తగ్గాయి. కొన్ని సెస్సులు, సర్చార్జీలను ఉమ్మడి పరిధిలో చేర్చకుండా కేంద్రం ఆధీనంలో ఉండటమే అందుకు కారణం. వాటిని ఉమ్మడి పంపిణీకి అందుబాటులో ఉంచాలి.

పతకమూరు
దామోదర్ ప్రసాద్
9440990381

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News