న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘మోడీ గ్యారంటీ’పై ఆయన‘నిరంతరాయంగా సాగిస్తున్న ప్రచారం’ వాస్తవాన్ని మార్చజాలదని, ఎన్నికలలో విజయానికి తనకు అవసరమైనదంతా ఆయన చెబుతుంటారని కాంగ్రెస్ విమర్శించింది. ఆయన‘వారంటీ’ ముగిసిందని పార్టీ అన్నది. తన ‘గ్యారంటీల’ ప్రయోజనాల గురించి ప్రధాని ఊదరగొడుతూ దేశమంతా తిరుగుతున్నారని, ఆయన ఇప్పటికే ఒక దశాబ్దంగా అధికారంలో ఉన్నందున తన హయాంలో ఇచ్చిన పది గ్యారంటీల పరిస్థితి ఏమిటి అన్నది జనం విశ్లేషించుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు.
ప్రతి సంవత్సరం భారతీయ యువజనుల కోసం రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రధాని మోడీ వాగ్దానం చేశారని, కాని నిరుద్యోగిత ‘అన్యాయ్ కాల్’ కింద భారత్‌లో 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని రమేష్ ఆరోపించారు. 2014 దరిమిలా నిరుద్యోగుల సంఖ్య ఒక కోటి నుంచి నాలుగు కోట్లకు పెరిగిందని, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ‘వేతనం లేని ఇంటి పని, పకోడా అమ్మకాలను ఉద్యోగాలుగా’ పేర్కొన్నదని రమేష్ తన ‘ఎక్ప్’ పోస్ట్‌లో ఆరోపించారు. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని 2016 ఫిబ్రవరి 28న మోడీ వాగ్దానం చేశారని, కాని రైతుల అసలు ఆదాయం ఏడాదికి కేవలం రెండు శాతం పెరిగిందని, 2022 నాటికి రెట్టింపు కావడానికి అవసరమైన సాలుకు 12 శాతాన్ని అది చేరుకోలేదని రమేష్ విమర్శించారు.
‘ఇంకా చెప్పాలంటే తగినంత ఎంఎస్‌పి లేని కారణంగాను, పెరుగుతున్న ముడి వస్తువుల ఖర్చుల వల్ల వ్యవసాయ సంక్షోభం విస్తృతమై రైతుల రుణభారం 60 శాతం మేర పెరిగింది. ఈపరిస్థితుల్లో 2014 నుంచి దాదాపు లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని ఆయన ఆరోపించారు. ప్రతి భారతీయుని బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షల గుప్త ధనం డిపాజిట్ చేయగలమని మోడీ వాగ్దానం చేశారని, కాని ఆ ‘గ్యారంటీ’ని హోమ్ శాఖ మంత్రి అమిత్ షా 2015 ఫిబ్రవరి 5న ఒక ‘జుమ్లా’గా ఒప్పుకున్నారని రమేష్ విమర్శించారు. ‘వాస్తవానికి మోడీ ప్రభుత్వం గుప్త ధనం కట్టడిలో పూర్తిగా విఫలమైంది. పెద్ద నోట్ల రద్దు వైఫల్యం తరువాత చలామణీలో ఉన్న నగదులో 99.3 శాతం ఆర్‌బిఐకి తిరిగి వచ్చింది.
ఆలోగా నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వంటి వంచకులు వేల కోట్ల రూపాయలు పిండుకుని తమ గుప్త ధనంతో దేశం నుంచి పరారయ్యారు’ అని రమేష్ ఆరోపించారు. చైనాపై కన్నెర్ర చేస్తామని మోడీ వాగ్దానం చేశారని, కాని, ఆ దేశం ‘ప్రస్తుతం రెండు వేల చదరపు కిలో మీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది’ అని కూడా ఆయన ఆరోపించారు. తాను అధికారంలో ఉండగా రిజర్వేషన్ల ‘జోలికి ఎవ్వరూ రాజాలరు’ అని ప్రధాని మోడీ చెప్పుకున్నారని రమేష్ తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి అభ్యర్థుల కోసం టీచింగ్ ఉద్యోగాల రిజర్వేషన్ రద్దుకు యుజిసి గత జనవరిలో ముసాయిదా మార్గదర్శక సూత్రాలు జారీ చేసిందని రమేష్ తెలియజేశారు.